మోదీ బొమ్మ తీసేయండి..!
జ్యూట్ బ్యాగులపై తన ఫొటో మాత్రమే ఉండాలన్న చంద్రబాబు
సాక్షి, విజయవాడ బ్యూరో: ఒకపక్క రాష్ట్ర రాజధాని నగరం అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు ఆయనను అవమాన పరిచే నిర్ణయం తీసుకున్నారు. రాజధాని రైతులకు దుస్తులు పెట్టి ఇచ్చే జ్యూట్ బ్యాగ్‌పై ప్రధాని బొమ్మను తొలగించారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు చీర, ధోవతి, కండువా, రవిక అందచేసి ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది.వీటిని గోగునారతో తయారు చేసిన సంచిలో వారికి అందించాలని భావించింది. ఆ బాధ్యతను విజయవాడ టీడీపీలో పనిచేసే ఒక నేతకు చెందిన సంస్థకు కాంట్రాక్టు కట్టబె ట్టింది.
ఆ కాంట్రాక్టర్ సంచికి ఒక వైపున ప్రధాని నరేంద్రమోదీ, మరోవైపున సీఎం చంద్రబాబు ఫొటోలను ముద్రించి తీసుకొచ్చారు. ఆ సంచిని పరిశీలించిన చంద్రబాబు రూ.కోట్ల ఖర్చుతో కార్యక్రమం నిర్వహిస్తుంది మనం(ఏపీ ప్రభుత్వం) ఐతే ఆ సంచిపై ప్రధాని మోదీ బొమ్మ ఎందుకని ప్రశ్నించిన ఆయన తొలగించాలని ఆదేశించారు. తన ఫొటో మాత్రమే వేయాలని స్పష్టం చేశారు. దీంతో అయన చెప్పినట్లే ఒక్కో బ్యాగుకు రూ. 35 ఖర్చు చేసి 30 వేల బ్యాగులను తయారు చేశారు.