అక్రమాలు ఆగేనా..? | rerequrments vigilens department | Sakshi

అక్రమాలు ఆగేనా..?

Published Tue, Aug 30 2016 10:03 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

అక్రమాలు ఆగేనా..?

అక్రమాలు ఆగేనా..?

  • రేషన్‌బియ్యం అక్రమాలకు ముకుతాడు
  • కొత్తగా పీడీఎస్‌ కంట్రోల్‌ ఆర్డర్‌ జారీ
  • బియ్యం అమ్మినా, కొన్నా క్రిమినల్‌ చర్యలు
  • లబ్ధిదారుల ఆహారభద్రత కార్డు రద్దు
  • జిల్లాకు విజిలెన్స్‌ విభాగం పునరుద్ధరణ
  • ముకరంపుర:  రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం, ఇతర సరుకుల విషయంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పలుకీలక మార్పులకు సర్కార్‌ శ్రీకారం చుట్టింది. ప్రజాపంపిణీకి సంబంధించి కొత్తగా పీడీఎస్‌ కంట్రోల్‌ ఆర్డర్‌ను మంగళవారం ప్రభుత్వం జారీచేసింది. గతంలో రద్దు చేసిన పౌరసరఫరాల శాఖలోని విజిలెన్స్‌ విభాగాన్ని పునరుద్ధరిం^è నుంది. ఈ–పాస్‌ విధానం ద్వారా సరుకులను సరఫరా చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీంతో రేషన్‌బియ్యం పక్కదారికి అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. 
     
    నిత్యం ఎక్కడో చోట పేదలకు చేరాల్సిన బియ్యం విషయంలో అక్రమాలు బయటపడుతున్నాయి. అధికారుల దాడులు, తనిఖీలు చేస్తున్నా ఆగడంలేదు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు, డీలర్లు, దళారులు, మిల్లర్ల పాత్రతో ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు బియ్యం అక్రమంగా తరలిపోతోంది. జిల్లాలో 10.62 లక్షల ఆహారభద్రత కార్డులుండగా.. ప్రతీనెలా 2300 మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. 2015లో 417 కేసులు నమోదు చేసి రూ.3.96 కోట్ల విలువైన సరుకులను స్వాధీనంచేసుకున్నారు. అందులో 50 క్రిమినల్‌ కేసులు నమోదుచేశారు. ఈ ఏడాది జనవరి 1నుంచి జూలై వరకు 383 కేసులు నమోదు చేసి రూ.1.36 కోట్ల విలువైన రేషన్‌ సరుకులను స్వాధీనం చేసుకున్నారు. బియ్యం అక్రమ రవాణాకు ముకుతాడు వేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగా మంగళవారం పౌరసరఫరాల శాఖ కమిషనరేట్‌ నుంచి జారీ చేసిన పీడీఎస్‌ కంట్రోల్‌ ఆర్డర్‌లో కీలక నిర్ణయాలున్నాయి. ప్రజాపంపిణీ ద్వారా సరఫరా చేసే సరుకులను కార్డుదారుడుగానీ, కొనుగోలుదారుడు, డీలర్‌ సహా ఎవరు పక్కదారి పట్టించినా క్రిమినల్‌ చర్యలతోపాటు జరిమానా విధించనున్నారు. ఈ లెక్కన బియ్యం కొనుగోలు చేసిన వ్యక్తితోపాటు అమ్మిన కార్డుదారుడు లేదా డీలర్‌పై చర్యలతోపాటు లబ్ధిదారుడి కార్డును రద్దు చేయనున్నారు.
     
    ప్రత్యేక విజిలెన్స్‌ విభాగం
    పక్కదారి పడుతున్న సరుకులకు అడ్డుకట్ట వేసేందుకు త్వరలో జిల్లాకు ప్రత్యేక విజిలెన్స్‌ విభాగం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2001 ముందు ఈశాఖ ఆధ్వర్యంలో విజిలెన్స్‌ ఉండేది. దాని అవసరం తగ్గిందని అప్పటి ప్రభుత్వం రద్దుచేసింది. ప్రత్యేక యంత్రాంగం ఉండే విజిలెన్స్‌ విభాగంతో కేవలం అక్రమాలపైనే దృష్టి కేంద్రీకరించే అవకాశముంది. నిఘా ఏర్పాటు చేస్తే ప్రత్యేక యంత్రాంగాన్ని పోలీసులతో చేస్తారా? అధికార యంత్రాంగంతో ఏర్పాటు చేస్తారా? అనేది తేలాల్సి ఉంది. 
     
    త్వరలో ఈ పాస్‌ విధానం..
    రాష్ట్ర ప్రభుత్వం ఈ పాస్‌విధానం(బయోమెట్రిక్‌)తో సరుకులు పంపిణీచేయాలని నిర్ణయించింది. ఇప్పటికే రంగారెడ్డిసహా కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా సత్ఫలితాలివ్వడంతో అన్నిజిల్లాల్లో అమలుచేయాలని కసరత్తు చేస్తున్నారు. కుటుంబంలో ఎవరో ఒకరు రేషన్‌ షాపుకు వెళ్లి వేలిమద్రలతో సరుకులు తీసుకునే అవకాశముంది. దీంతో బియ్యం నిల్వలు, పంపిణీలో అవకతవకలకు అడ్డుకట్టపడనుంది. కార్డుకు ఆధార్‌ అనుసంధానం, ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తయింది. ఆహారభద్రత కార్డులు ముద్రించినా  కొత్త జిల్లాలు ఏర్పాటయ్యే వరకు వాటిని పక్కనే ఉంచాలని మౌఖిక ఆదేశాలందాయి. ఈ–పాస్‌ విధానంతో ఈకార్డులు కూడా అక్కరకు రానివే కానున్నాయి. 
     
    చక్కెరకూ లైసెన్స్‌..
    ఇకపై చక్కెర అమ్మకాలను ప్రభుత్వం కఠినతరం చేసింది. గతంలో లాగా చక్కెరను ఎవరు పడితే వారు అమ్మడానికి వీలు లేదు. పౌరసరఫరాల శాఖ ద్వారా లైసెన్స్‌ పొందిన వ్యాపారులే అమ్ముకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. చక్కెర లైసెన్స్‌లో భాగంగా హోల్‌సేల్‌ వ్యాపారులు రూ.12వేలు, రిటేల్‌ దుకాణాదారులు రూ.6వేలు డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్‌ కోసం హోల్‌సేల్‌ వ్యాపారులు రూ.2వేలు, రిటేల్‌వ్యాపారులు రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటోంది. వెయ్యి క్వింటాళ్ల వరకు హోల్‌సేల్‌ వ్యాపారులు, 40 క్వింటాళ్ల వరకు రిటేలర్లు చక్కెను నిల్వ ఉంచుకునేందుకు అనుమతించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు.
     
    మహారాష్ట్రకు తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత
    రామగుండం/పెద్దపల్లిరూరల్‌: మహారాష్ట్రకు తరలిస్తున్న బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. మంగళవారం ప్యాసింజర్‌ రైలులో మహారాష్ట్రకు రేషన్‌ బియ్యం తరలించేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ప్లాట్‌ఫారంపైకి తరలించారు. సమాచారం తెలుసుకున్న పౌరసరఫరా శాఖ అధికారులు పెద్దంపేట రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. 24 బ్యాగుల్లో ఉన్న సుమారు ఏడు క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సమీపంలోని రేషన్‌ డీలర్‌కు అప్పగించారు. పెద్దపల్లి ఏఎస్‌వో బి.కిష్టయ్య, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డెప్యూటీ తహశీల్దార్‌ తొడుపునూరి అంజయ్య, సుల్తానాబాద్‌ డెప్యూటీ తహశీల్దార్‌ ఎన్‌.మల్లిఖార్జున్‌రెడ్డి, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ తిరుపతి తదితరులున్నారు. పెద్దపల్లిలోని ప్రగతినగర్‌ ప్రాంతంనుంచి కరీంనగర్‌కు అక్రమంగా తరలిస్తున్న 11మెట్రిక్‌ టన్నుల రేషన్‌బియ్యాన్ని మంగళవారం పట్టుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement