
అరచేతిలో సమాచారం
మణికొండ: సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు పాఠ్యాంశాలకు సంబంధించిన అదనపు సమాచారం అరచేతిలో ఉంటుందని ఆ శాఖ రాష్ట్ర కమిషనర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం నార్సింగ్ గురుకుల పాఠశాలలో మూడు స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కియోస్క్‌లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏటీఎంల తరహాలో ఇవి పాఠశాలల ఆవరణలో 24 గంటలూ అందుబాటులో ఉంటాయన్నారు. గూగుల్‌లో వెతికినట్టు వెతికితే పాఠ్యాంశానికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు, యానిమేషన్లు విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఎక్కువ సమాచార సేకరణతో పాటు... పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించేందుకు ఇవి దోహద పడతాయని పేర్కొన్నారు. టచ్‌సీ్‌క్రన్ రూపంలో ఇవి పని చేస్తాయన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో ఇలాంటివి ప్రవేశపెడతామన్నారు.
పరిరక్షించుకుందాం: పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరం పాటుపడాల్సిన అవసరం ఉందని సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల రాష్ట్ర కమిషనర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం నార్సింగ్ గురుకుల పాఠశాలలో ఢిల్లీకి చెందిన టెరీ యూనివర్సిటీ విద్యార్థులు పర్యావరణంపై నిర్వహించిన అవగాహన సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవుల సంరక్షణతో పాటు వాతావరణ కాలుష్యం లేకుండా చూసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నార్సింగి, షేక్‌పేట్, మహీంద్రాహిల్స్, ఇబ్రహీంపట్నం కళాశాలలకు చెందిన 120 మంది విద్యార్థులు, గురుకుల సంస్థ ప్రాంతీయ సమన్వయకర్త ఏవీ రంగారెడ్డి, నార్సింగ్ ప్రిన్సిపాల్ ధనలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ అనిత తదితరులు పాల్గొన్నారు.