పోలీసుల్లో జవాబుదారీతనం పెరగాలి
గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్
సత్తెనపల్లి: పోలీసుల్లో జవాబుదారీతనం పెరగాల్సిన అవసరం ఉందని గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ అభిప్రాయపడ్డారు. సోమవారం సత్తెనపల్లి పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్‌లను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రూరల్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డీజీపీ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్‌ల్లో ఉన్న పాత వాహనాలను క్లియర్ చేస్తున్నామన్నారు. ఆగస్టు 28న డీజీపీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా తెలియజేశారని సౌత్ కోస్టల్ పరిధిలో 2610 వాహనాలను క్లియర్ చేశామన్నారు. వాహనాల క్లియరెన్సులో సత్తెనపల్లి సబ్ డివిజన్ ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. ఆత్మకూరు, తెనాలి ద్వితీయ స్థానాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. 45 రోజుల్లో సత్తెనపల్లి సబ్ డివిజన్‌లో 283 వాహనాలు క్లియర్ చేశారని 57 వాహనాలు వివిధ కేసుల పరంగా ఉన్నాయన్నారు. వాటన్నీంటికి క్యూ ఆర్ కోడ్ నిక్షిప్తం చేస్తున్నామన్నారు. ఈ క్యూ ఆర్ కోడ్ వలన ఉన్నతాధికారులు పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు వాటి వివరాలు ఇట్టే తెలిసిపోతాయన్నారు. క్యూ ఆర్ కోడ్‌పై వర్కు షాపులు నిర్వహిస్తున్నామన్నారు. స్టికర్ లేని వాహనాలు ఇకపై పోలీస్ స్టేషన్‌లో ఉండవన్నారు. సౌత్ జోనల్ కోస్టల్ పరిధిలో యుద్ద ప్రాతిపదికన ఈ ప్రక్రియ చేపట్టామన్నారు. పోలీస్ విభాగం చేస్తున్న పనులకు S సహకరించిన జ్యూడిషియల్, మండల మేజిస్ట్రేట్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ స్టేషన్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే సిబ్బంది పనితీరు వేగవంతంగా ఉంటుందన్నారు. టెక్నాలజీని పూర్తిస్థాయిలో ఉపయోగించు కోవాల్సి ఉందన్నారు. టెక్నాలజీ వ్యక్తులు వచ్చి చేప్పేదానికంటే ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలన్నారు.