‘ఆవు’ద్బాంధవుడు
♦ మూగజీవాలతో విరాజిల్లుతున్న గోశాల
♦ కుకునూరులో 36 ఏళ్ల క్రితం ఏర్పాటు
ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు గోవులపై మమకారంతో గోశాలను ఏర్పాటుచేసి 36 ఏళ్లుగా నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. ఆయన కుటుంబం సైతం గోరక్షణలో పాలుపంచుకుంటోంది. అంతేకాదు గ్రామస్తులందరూ ఆవులను తమ ఇలవేల్పుగా కొలుస్తున్నారు.
వెల్దుర్తి: మండలంలోని కుకునూరు గ్రామంలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు 36 ఏళ్ల క్రితం ఆరు గోవులతో ఏర్పాటు చేసిన శ్రీసీతారామ గోశాల ప్రస్తుతం అరవై మూగజీవాలతో విరాజిల్లుతోంది. గ్రామంలోని దాతల సహకారంతో పాటు తనకొచ్చే పెన్షన్‌లో సగం డబ్బులను వాటి సంరక్షణకే ఖర్చుచేస్తున్నారు. ఆవులు సంఖ్య పెరగడంతో గ్రామానికి చెందిన ఓ దాత ప్రత్యేకంగా షెడ్డు నిర్మించారు.
రోజూ రూ.1200 ఖర్చు
శ్రీనివాసరావు తన సొంత స్థలంలో చిన్నపాటి షెడ్డులో 1980లో బ్రాహ్మణులకు దానంగా వచ్చిన ఆరు ఆవులతో ఈ గోశాల ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఇక్కడ 60 గోవులున్నాయి. గోశాల పక్కనే ఉన్న సీతారామ దేవస్థానం అభివృద్ధి కమిటీ గోశాల రక్షణకు పాటు పడుతున్నారు. ప్రతిరోజు మేత, దాణ కోసం రూ. 1200 ఖర్చు చేస్తున్నారు.
టీటీడీ పూజలు
ఏటా జనవరి 16వ తేదీన టీటీడీ ఆధ్వర్యంలో సంగారెడ్డికి చెందిన విశ్విహ ందూ పరిషత్ నిర్వాహకులు గోశాలలో గోమాత పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామ మహిళలు ఆవులకు మంగళహారతులు ఇచ్చి.. బెల్లం, కుడుకలు, ఇతర ఆహార పదార్థాలు అందజేస్తారు. పండగలు, శుభకార్యాలకు గోపూజలు చేయడం పరిపాటిగా మారింది. ఆవులకు పాత షెడ్డు సరిపోకపోవడంతో హైదరాబాద్‌లో స్థిరపడిన గ్రామస్తుడు గజవాడ వెంకటేశం రూ. 2.20 లక్షలతో ప్రత్యేక షెడ్డు నిర్మించారు.
శుభకార్యాలకు పాల పంపిణీ
ఆవు పాలను గ్రామంలోని ఆలయాల్లో పూజలు, ఇళ్లలో శుభకార్యాల కోసం అందజేస్తున్నారు. ఆవుల పెంపకం, నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఇద్దరు కూలీలను ఏర్పాటు చేశారు. దాతలు ముందుకొచ్చి గోశాల సంరక్షణ చేపట్టాలని నిర్వాహకులు, గ్రామస్తులు కోరుతున్నారు.
గోశాల అభివృద్ధికి కృషి
నాతో పాటు 15 మంది సభ్యులం సీతారామ ఆలయ కమిటీగా ఏర్పడ్డాం. ఆలయ అభివృద్ధితో పాటు దాతల సహకారంతో గోశాలను అభివృద్ధి చేస్తున్నాం. ఆలయంలో ప్రతి పౌర్ణమి రోజు అన్నదానం చేయగా వచ్చిన కట్నాలను గోశాల ఖర్చులకు వినియోగిస్తున్నాం.
- నరేందర్‌రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు
శేష జీవితం ఇక్కడే
మా శేష జీవితం గోశాల రక్షణకే. మాకొచ్చే 18 వేల పెన్షన్‌లో భోజనం, మందుల ఖర్చు పోగా రూ. 10 వేల వరకు ఆవుల సంరక్షణకు ఖర్చు చేస్తున్నాం. దాతలు కూడా సహాయం చేస్తున్నాం. నా కుమారులిద్దరూ నాచారం లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో పూజారులు. వారు కూడా గోవుల రక్షణకు సహకరిస్తున్నారు. - శ్రీనివాసరావు, పద్మమ్మ, నిర్వాహకులు