బియ్యం.. ధరల భయం | rice.. rate fear | Sakshi
Sakshi News home page

బియ్యం.. ధరల భయం

Published Mon, Jul 25 2016 10:51 PM | Last Updated on Mon, Oct 1 2018 5:19 PM

బియ్యం నిల్వలు - Sakshi

బియ్యం నిల్వలు

  • కేజీ ధర రూ.50 పైమాటే..
  •  

    •  రైతుల వద్ద ధాన్యం నిల్వలు లేక రేటు పెంచిన వ్యాపారులు
    •  ఖరీఫ్‌ సీజన్‌ ముగిసే సరికి రూ.60కి చేరే అవకాశం
    •  సూపర్‌ మార్కెట్లలో మరీ ఎక్కువకు అమ్మకం

     

    • వారం రోజులుగా పెరిగిన బియ్యం ధరలు ( కిలో ఒక్కంటికి)

    బియ్యం రకం                        గత వారం ధర        ప్రస్తుత ధర
    ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
    బ్రాండెడ్‌ (సూపర్‌ మార్కెట్‌లో)   49                    54
    నం.1 రకం                              45                    48
    నం.2 రకం                              38                    42
    కొత్త బియ్యం                            35                    38
    ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
    కొత్తగూడెం:
        బియ్యం ధరలు మండిపోతున్నాయి. రోజుకో రీతిలో ధరల్లో మార్పు చోటుచేసుకుంటుండంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. కిలో బియ్యం రూ.50కి పైగా ధర పలుకుతుండటంతో ఎలా తినేది.. అని వాపోతున్నారు.

    • రైతుల వద్ద ధాన్యం నిల్వలు నిండుకోవడంతో...

    రబీ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యం నిల్వలు నిండుకోవడంతో వ్యాపారస్తులు ఒక్కసారిగా బియ్యం ధరలను పెంచేశారు. పాత బియ్యం పేరుతో మరింత ఎక్కువ రేటు చెప్తుండటంతో సామాన్యులు కొనే పరిస్థితి లేదు. వారంరోజుల వ్యవధిలోనే సామాన్య, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసేందుకు కూడా వీలులేకుండా బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. సూపర్‌ మార్కెట్లో బ్రాండెడ్‌ బియ్యం గత వారం కేజీ రూ.49 ఉంటే ప్రస్తుతం రూ.54 పలుకుతోంది. ఇక మధ్య తరగతి ప్రజలు తినే సాంబమసూరి (నం.1 రకం) రూ.45 నుంచి కేజీ రూ.48కి ధర పెరిగింది. ఇలా వారం రోజుల వ్యవధిలో కేజీకి సుమారు రూ.3 నుంచి రూ.5 వరకు పెరగడంతో సామాన్యుల బడ్జెట్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌ ధాన్యం రైతుల వద్దకు వచ్చేవరకు ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఏడాది రూ.60 వరకు బియ్యం ధరలు చేరే అవకాశాలున్నాయని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి.

    • సూపర్‌ మార్కెట్లో మరీ అధికం

    రిటైల్‌ దుకాణాలతో పోలిస్తే సూపర్‌ మార్కెట్‌లలో లభించే బ్రాండెడ్‌ బియ్యం ధరలు మరీ ఎక్కువగా ఉంటున్నాయి. బ్రాండెడ్‌ పేరుతో సూపర్‌ మార్కెట్‌లలో వ్యాపారస్తులు విపరీతంగా రేట్లు పెంచి విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రిటైల్‌ దూకాణాల్లో రెండు మూడు రకాల బియ్యం లభిస్తున్నాయి. వాటిల్లో ఏది తక్కువ ధరుంటే వాటినే కొనుగోలు చేస్తున్నారు. సూపర్‌ మార్కెట్‌లో ఆ అవకాశం కూడా లేకుండా బ్రాండెడ్‌ పేరుతో అధిక రేట్లు వసూలు చేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. బియ్యం ధరలను నియంత్రించకపోతే రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశం ఉంది.

    • ధరలు తగ్గించాలి: రబియా, కొత్తగూడెం

    బియ్యం ధరలు బాగా పెరుగుతున్నాయి. వీటిని ప్రభుత్వమే తగ్గించాలి. కూలీనాలి చేసుకుని బతికే మాలాంటి మధ్యతరగతి కుటుంబాలకు రోజుకు బియ్యానికి  రూ.100 ఖర్చు వస్తుంది. ఇక కూరగాయలు, నిత్యావసర వస్తువులు.. వేటి ధర చూసినా మండిపోతోంది.

    • ధరలు అందుబాటులో ఉండాలి: సుశీల, కొత్తగూడెం

    సామాన్యులకు బియ్యం ధరలు ఏమాత్రం అందుబాటులో లేవు. సూపర్‌మార్కెట్‌లో బ్రాండెడ్‌ బియ్యం ధరలు విపరీతంగా ఉన్నాయి. రేషన్‌ బియ్యం నెలరోజులకు సరిపోక షాపుల్లో బియ్యం కొనాల్సి వస్తోంది. కానీ ఈ తీరుగ ధరలుంటే ఏమి కొంటాం.. ఏమి తింటాం..  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement