వైజాగ్లో ఈడు గోల్డ్ ఎహే!
సందడి చేసిన సునీల్,రీచాఫనయ్
‘కోపాలెందుకు బాబాయ్’ పాట విడుదల
పెదవాల్తేరు/మద్దిలపాలెం : ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వీరుపోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈడు గోల్డ్ ఎహే!’ చిత్రం యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని చిత్ర హీరో సునీల్ పేర్కొన్నాడు. ఈ చిత్రంలో రెండో పాట ‘కోపాలెందుకు బాబాయ్’ను గురువారం మద్దిలపాలెం సీఎంఆర్‌లో విడుదల చేశారు.
ఈ కార్యక్రమానికి చిత్రయూనిట్‌లో హీరో సునీల్‌తోపాటు,హీరోయిన్ రీచాఫనయ్ దర్శకుడు వీరుపోట్ల,సీనియర్ నటుడు బెనర్జీ,ప్రతినాయకుడు చరణ్ పాల్గొన్నారు. పాటకు అనుగుణంగా తనదైన శైలిలో సునీల్, రీచా చిందులేశారు.ఐలవ్యూ వైజాగ్ అంటూ ఫ్లయింగ్ కిస్‌లతో రీచా విశాఖ కుర్రకారును ఉర్రూతలూగించారు. ఈసందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించింది. అంతకుముందు 93.5 రెడ్ ఎఫ్.ఎం.లో రెండోపాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. కార్యక్రమంలో రెడ్ ఎఫ్‌ఎం ఆర్జేలు షామిలి,రోహిత్,అనూష,ప్రదీప్,క్రిష్ణ పాల్గొన్నారు.
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్
పక్కా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ‘ఈడు గోల్డ్ ఎహే!’ చిత్రం అందరిని అలరిస్తుంది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కించిన సునీల్‌కు అందాలరాముడు తరువాత మర్యాదరామన్న అంతటి హిట్ ఈ చిత్రం సాధించడం గ్యారంటీ.-దర్శకుడు వీరుపోట్లా
నాది వైజాగే..
ఈడు గోల్డ్ ఎహే! చిత్రంలో పాటలు చాలా బాగా వచ్చాయి. ఈ పాటలన్నీ నేనే రాశాను. నా సొంతూరు వైజాగే. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను. ఈచిత్రానికి మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాను.
-గీతరచయిత బాలాజీ
నా తొలి చిత్రం షూటింగ్ గీతంలోనే..
వెండితెరపై నా తొలి అడుగు పడింది వైజాగ్‌లోనే. తొలి చిత్రం పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రం షూటింగ్ గీతం యూనివర్సిటీలో జరిగింది. అందులో హీరో స్నేహితులు బృందంలో నేను ఒకడిగా నటించాను. చిత్రరంగంలోకి వెళ్లకు ముందు వైజాగ్‌లో చాలా కాలం ఉన్నాను. నాకు ఇక్కడ చుట్టాలు చాలా మంది ఉన్నారు. తెరకు పరిచయం అయిన తరువాత నన్ను ఎంతగానో ఆదరిస్తున్నది మాత్రం వైజాగ్ వాసులే. అక్టోబర్‌లో ఈ చిత్రం విడుదలకానుంది.
- హీరో సునీల్