పుష్ప వల్లే విదేశాల్లో కూడా గుర్తు పడుతున్నారు: సునీల్ | Tollywood Actor Sunil About Allu Arjun Pushpa 2 Craze World wide | Sakshi
Sakshi News home page

Sunil: పుష్ప సీన్ చూపించి మరీ గుర్తు పట్టాడు: సునీల్

Published Sun, Feb 9 2025 2:50 PM | Last Updated on Sun, Feb 9 2025 4:20 PM

Tollywood Actor Sunil About Allu Arjun Pushpa 2 Craze World wide

ఐకాన్ స్టార్‌ ‍అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా  ఓవరాల్‌గా రూ.1831 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటించింది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, టాలీవుడ్ నటులు జగపతి బాబు, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో మెప్పించారు.

పుష్ప-2 మూవీ బ్లాక్ బస్టర్‌ హిట్ కావడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా కోసం పని చేసిన వారికోసం థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌కు పుష్ప-2 టీమ్ అంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా హాజరైన టాలీవుడ్ నటుడు సునీల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా వల్లే తనను ఎక్కడికెళ్లినా గుర్తు పడుతున్నారని తెలిపారు. స్పెయిన్‌లో షూటింగ్‌ జరుగుతుండగా కొందరు పాకిస్తాన్ అభిమానులు తనను గుర్తు పట్టారని వెల్లడించారు. అంతేకాదు తమకు భోజనాలు వండి పెట్టారని సునీల్ వివరించారు.

సునీల్ మాట్లాడుతూ.. 'మూవీ షూట్‌ కోసం ఇటీవల స్పెయిన్‌ వెళ్లా. రాత్రి 10 గంటలకు అక్కడ రెస్టారెంట్లు క్లోజ్ చేస్తారు. నేను 9.45 గంటల సమయంలో ఒక పెట్రోల్‌ బంక్‌కు వెళ్లి స్నాక్స్‌ కోసం అక్కడే ఉన్న స్టోర్‌కి వెళ్లి అడిగా. కానీ అది ‍అప్పటికే క్లోజ్‌ చేశారని అక్కడే ఉన్న ఓ మహిళ చెప్పింది. ఆ తర్వాత దగ్గర్లో హోటల్స్ ఏమైనా ఉన్నాయా అని వెతికా. కబాబ్‌ పాయింట్‌ అనే ఓ చిన్న హోటల్‌ కనిపించింది. ఇండియన్‌ ఫుడ్‌కు సంబంధించిన హోటల్‌ అయి ఉండొచ్చని అక్కడి వెళ్లా. అప్పుడు సమయం అర్ధరాత్రి రెండున్నర అయింది. మేము కారు దిగగానే ఓ వ్యక్తి నన్నే అలాగే చూస్తూ ఉన్నాడు. వెంటనే తన ఫోన్‌లో పుష్ప ఇంటర్వెల్‌ సీన్‌ చూపించి మీరే కదా అని అడిగాడు. ఆ తర్వాత తెలిసింది అది పాకిస్థానీయుల రెస్టారెంట్‌ అని. నాతోపాటు డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న సభ్యులందరికీ వారు వంట చేసి పెట్టారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులతో వీడియో కాల్‌లో మాట్లాడా' అని పంచుకున్నారు. పుష్ప తర్వాత తమిళం, కన్నడ, మలయాళంలో మంచి పాత్రలు వస్తున్నాయని సునీల్ ఆనందం వ్యక్తం చేశారు. నన్ను చూస్తే అందరికీ పుష్ప సినిమానే గుర్తుకు వస్తోందని అన్నారు.
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement