'భారత విద్యార్థులను ఉద్దేశ పూర్వకంగా అవమానించలేదు'
విశాఖపట్నం : యూఎస్ వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 30 శాతం పెరిగిందని భారత్లోని అమెరికా రాయబారి రిచర్డ్ ఆర్ వర్మ వెల్లడించారు. శుక్రవారం విశాఖపట్నంలో స్మార్ట్సిటీపై జరిగిన భాగస్వామ్య సదస్సులో రిచర్డ్ ఆర్ వర్మ ప్రసంగించారు. యూఎస్టీడీఏతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. భారత్, యూఎస్ల మధ్య సహకారానికి స్మార్ట్సిటీతో పునాది పడిందన్నారు.
యూఎస్లో భారతీయ విద్యార్థులను ఉద్దేశపూర్వకంగా అవమాన పర్చలేదని రిచర్డ్ ఆర్ వర్మ స్పష్టం చేశారు. ప్రవేశాల్లో రెండు అంకెల పద్దతిపై అవగాహన లేకే విద్యార్థులు ఇబ్బందులు పడ్డారన్నారు. రక్షణ రంగంలో సహకారానికి ఇరు దేశాలు ప్రాధాన్యం ఇస్తున్నాయని చెప్పారు. జెట్ విమానాల తయారీకి పరస్పర సహకారంతో పనిచేసేందుకు రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయన్నారు.
ఇరు దేశాల వాణిజ్యవ్యాపారాల్లో 500 బిలియన్ డాలర్లు చేసుకోవాలన్నదే లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించారు. అమెరికా ఎగుమతులు, దిగుమతుల్లో భారత్ వాటా 2 శాతం మాత్రమే అని వెల్లడించారు. పౌర అణురంగంలో భారతదేశంతో మరింత సంబంధాలు పెంచుకుంటామన్నారు.