మృత్యు పంజా!
మృత్యు పంజా!
Published Mon, Jul 25 2016 11:03 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
– మానపాడు వద్ద రోడ్డు ప్రమాదం
– టైర్ పంక్చరై అదుపు తప్పిన లారీ
– లారీని తప్పించబోయి వెనుక వస్తున్న కారు బోల్తా
– కర్నూలకు చెందిన ఒకే కుటుంబంలో నలుగురు మృతి
– కుమారుడిని విమానం ఎక్కించి వస్తుండగా ఘటన
మృత్యువు పంజా విసిరింది. ఆనందంగా కారులో కబుర్లు చెప్పుకుంటూ వస్తున్న కుటుంబాన్ని కబళించింది. దుబాయ్ నుంచి రంజాన్ పండుగకు వచ్చిన కుమారుడు తిరిగి వెళ్తుండగా వీడ్కోలు చెప్పేందుకు కుటుంబీకులు విమానాశ్రయం వెళ్లారు. విమానం ఎక్కిన కుమారుడికి బైబై చెప్పి కుటుంబసభ్యులతో ఆనందంగా వెనుదిరిగారు. ఆ మధుర క్షణాలు మదిలో ఉండగానే మృత్యువు వారిని పొట్టన పొట్టుకుంది. మహబూబ్ నగర్ జిల్లా మానపాడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు నగరానికి చెందిన ఒకే కుటుంబంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారులో ఉన్న చిన్నారి మాత్రమే ప్రాణాలతో బయటపడింది.
– కర్నూలు(హాస్పిటల్)
కర్నూలు నగరంలోని లాల్‌మజీద్ ప్రాంతంలో నివాసముంటూ నసీర్ అహ్మద్‌ఖాన్(65) అనే వ్యక్తి పొగాకు వ్యాపారం చేస్తున్నారు. ఈయన తండ్రి దివంగత షంషీర్‌ఖాన్ గతంలో శంకుబీడి యజమాని. నసీర్ అహ్మద్‌ఖాన్‌కు భార్య రిజ్వాన్‌ఖాతూమ్(52)తో పాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు షోయబ్ అలీఖాన్ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఆయనకు భార్య ఫర్జానాఖాతూమ్(25), కుమార్తెలు ఎలీనా ఖాతూమ్(5), హానియా ఖాతూమ్(4) ఉన్నారు. షోయబ్ అలీఖాన్ రంజాన్ పండుగను పురస్కరించుకుని గత మాసంలో కర్నూలుకు వచ్చారు. పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకుని, కుటుంబసభ్యులతో ఆనందాన్ని పంచుకుని సోమవారం దుబాయ్‌కు తిరుగుప్రయాణమయ్యాడు. అతన్ని సాగనంపేందుకు తండ్రితో పాటు తల్లి, భార్య, ఇద్దరు కుమార్తెలు షంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు. ఉదయం ఆయనను విమానం ఎక్కించారు. తిరుగుప్రయాణంలో నసీర్ అహ్మద్‌ఖాన్ స్వయంగా టీఎస్ 11ఈజి 5409 కారును డ్రై వింగ్ చేస్తూ వచ్చారు. వీరి కారు మానపాడు మండలం జల్లాపూర్ స్టేజి వద్దకు రాగానే ఎదురుగా వెళ్తున్న లారీ టైర్ పంక్చర్ అయ్యింది. లారీ అదుపుతప్పి అటు ఇటూ తిరుగుతుండగా దాన్ని తప్పించబోయి కారు బోల్తాపడింది. ప్రమాదంలో ఎలీనాఖాతూమ్(5) మినహా కారులోని అందరూ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు వెంటనే పాపను కర్నూలులోని ఓ ప్రై వేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. పాపకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్తామని కుటుంబసభ్యులు చెప్పారు. మానపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
దుఃఖసాగరంలో లాల్‌మజీద్ ప్రాంతం
షంషీర్‌ఖాన్ కుటుంబమంటే పాతబస్తీలో అందరికీ తెలుసు. ఆయన శంకుబీడి వ్యాపారం చేసేవారు. ఆయన తదనంతరం ఆయన కుమారులు సైతం ఆ ప్రాంతంలో అంతే పేరు తెచ్చుకున్నారు. దీంతో ఆ కుటుంబం పట్ల లాల్‌మజీద్ కాలనీవాసులకు ఎనలేని ప్రేమాభిమానాలు ఉన్నాయి. మానపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని విషయం తెలియగానే ఆ కాలనీ ఒక్కసారిగా దుఃఖసాగరంలో మునిగిపోయింది. ప్రమాదంలో నసీర్ అహ్మద్‌ఖాన్, ఆయన భార్య రిజ్వానాఖాతూమ్, కోడలు ఫర్జానాఖాతూమ్, మనవరాలు హానియాఖాతూమ్ మరణించారు. వీరికి అలంపూర్‌లోనే పోస్టుమార్టం నిర్వహించి సాయంత్రం ఇంటికి తీసుకొచ్చారు. ఉదయం నవ్వుతూ కాలనీలో అందరినీ పేరుపేరునా పలకరించి వెళ్లిన కుటుంబం సాయంత్రం విగత జీవులై రావడంతో కాలనీవాసులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Advertisement
Advertisement