పుష్కర స్నానానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు..
Published Wed, Aug 24 2016 11:45 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM
ఇటిక్యాల: కృష్ణా పుష్కరాలు చివరి రోజు పుష్కరస్నానం కోసం బీచుపల్లికి వెళ్లి, 44వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. షాద్‌నగర్ మండలం బుర్గుల పంచాయతీ పరిధిలోని తండాకు చెందిన మూడవత్తు దస్రు (55) మంగళవారం బీచుపల్లిలో పుష్కరస్నానం చేశాడు. సాయంత్రం స్వగ్రామానికి వచ్చేందుకు జాతీయ రహదారి దాటుతుండగా లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు సూచనమేరకు హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య దస్తి, ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులున్నారు. కుమారుడు రామ్‌జీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇటిక్యాల ఏఎస్‌ఐ జిక్కిబాబు పేర్కొన్నారు.
ఎర్రవల్లి చౌరస్తాలో వృద్ధుడు..
కొడంగల్ రూరల్(కోస్గి): కోస్గి మండలకేంద్రానికి చెందిన జలంధర్‌రెడ్డి(71)మంగళవారం ఇంటి నుంచి పుష్కరాలకు వెళ్లాడు. ఈ క్రమంలో రాత్రి సమయంలో ఎర్రవల్లి చౌరస్తాలో దిగి మరో బస్సును ఎక్కేందుకు రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయనను పోలీసులు కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. అక్కడి పోలీసులు కోస్గిలోని జలంధర్‌రెడ్డి కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో వారు బుధవారం ఉదయం అక్కడికి వెళ్లి మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.
Advertisement