నుజ్జునుజ్జు అయిన ఆటో
ఓ డ్రైవర్ నిర్లక్ష్యాన్ని రెండు ప్రాణాలు బలయ్యాయి.
-
ఆటో, మినీ బస్సు ఢీ, ఇద్దరి దుర్మరణం
-
నిమజ్జన వేడుకలకు వెళ్తూ అనంతలోకాలకు..
ఓ డ్రైవర్ నిర్లక్ష్యాన్ని రెండు ప్రాణాలు బలయ్యాయి. త్వరగా గమ్యం చేరుకోవాలనే ఉద్దేశంతో మినీ బస్సు డ్రైవర్ ఓవర్ స్పీడ్‌గా వెళుతూ.. ముందు వెళుతున్న లారీని ఓవర్ టేక్ చేయబోయి.. ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో నలుగురు గాయపడ్డారు.
మహబూబ్‌నగర్ క్రైం: మండలంలోని ఓబులాయపల్లిలో సమీపంలో మంగళవారం సాయంత్రం ఓ మినీ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ యువకుడు అక్కడికక్కడే మృత్యువాతపడగా, మరో మహిళ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
రూరల్ ఎస్‌ఐ రాజేశ్వర్‌గౌడ్ కథనం ప్రకారం.. దేవరకద్ర మండలం గద్దెగూడెంకు చెందిన సతీష్ హైదరాబాద్‌లో గండిపేటలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఆంజనేయులు, దాస్, శ్రీను, మణెమ్మ, నక్షత్ర అక్కడే కూలీ పని చేస్తూ బతుకుతున్నారు. అయితే మంగళవారం గద్దెగూడెంలో వినాయక నిమజ్జనం ఉండటంతో మధ్యాహ్నం 12గంటల సమయంలో హైదరాబాద్ నుంచి ఆరుగురు కలిసి ఏపీ 28 టీబీ 8568నంబర్ కలిగిన ఆటోలో స్వగ్రామానికి బయల్దేరారు.
ఈ క్రమంలో సాయంత్ర 4.45 గంటల సమయంలో మండలపరిధిలో ఓబులాయపల్లి సమీపంలో కర్ణాటక నుంచి హైదరాబాద్ వెళ్తున్న కేఏ 20డీ 5797 నంబర్ కలిగిన మినీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేయబోయి అతివేగంతో పూర్తిగా రోడ్డు కుడివైపుకు వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఆంజనేయులు(17) అక్కడిక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ఎరుకలి మణెమ్మ(45)ను జిల్లా ఆస్పత్రికి తరలించగా, అక్కడే చికిత్స పొందుతూ మృత్యువాతపడింది. ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన ఆటో డ్రైవర్ సతీష్, దాస్, శ్రీను, చిన్నారి నక్షత్రలను జిల్లా ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఆస్పత్రిలో బంధువుల రోదనలు మిన్నంటాయి. గాయపడిని నక్షత మృతి చెందిన మణెమ్మ మనవరాలు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.