వ్యాన్ను ఢీకొన్న ఆర్టీసీ నాన్స్టా‹ప్
Published Tue, May 9 2017 12:25 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
గండేపల్లి/పెద్దాపురం :
కాకినాడ–రాజమహేంద్రవరం నాన్స్టా‹ప్ ఆర్టీసీ బస్సు ఏడీబీ రోడ్డులో ఆదివారం రాత్రి పదకొండు గంటల సమయంలో ప్రమాదానికి గురవడంతో బస్సు డ్రైవర్ సహా 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సుమారు 45 మంది ప్రయాణికులతో రాజమహేంద్రవరం వెళుతున్న ఈ బస్సుకు లలితా రైస్ గొడౌన్ నుంచి వస్తోన్న ఐషర్ వ్యాన్ అడ్డం వచ్చింది. వ్యాన్ రోడ్డుపైకి రావడాన్ని గమనించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ కనకాల శ్రీనివాసరావు బస్సును అదుపు చేస్తుండగా వ్యాన్ వెనక భాగంలో ఢీకొంది. ప్రమాదంలో బస్సు ముందు భాగం దెబ్బతినడంతో డ్రైవర్ స్టీరింగ్ వద్ద ఇరుక్కుపోయాడు. డ్రైవర్ వెనక సీట్లలో కూర్చున్న ప్రయాణికులు గాయపడ్డారు. దీంతో బస్సులోని వారు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. కొద్దిసేపటికే తేరుకుని గాయపడ్డ వారిని కిందకు దించారు.
ప్రమాద సమాచారం అందుకున్న ఆర్టీసీ సిబ్బంది తక్షణమే అక్కడకు చేరుకుని క్షతగాత్రులను 108లో పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పెద్దాపురం ఆస్పత్రిలో చికిత్స పొందిన వారు వేరే బస్సులో రాజమహేంద్రవరం వెళ్లిపోయారు. పోలీసులకు ఈ సమాచారం వెంటనే తెలియజేయలేదు. దీంతో వారు సోమవారం ఉదయం పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో వివరాలు సేకరించారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై రజనీకుమార్ తెలిపారు.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు
క్షతగాత్రులు కె.దుర్గప్రసాద్, కె.సత్య, యు.వీరభద్రరావు, ఎం.సత్య, పి.చిరంజీవి, కె.శ్రీనివాసరావు. వి.సతీష్ పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ ఆస్పత్రికి తరలించినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
కాకినాడకు చెందిన యు.వరలక్ష్మి, ఎన్.ప్రవీణ్‌కుమార్, వి.వెంకట్రావు, జీవీ రాఘవేంద్రరావు, ఫణికుమార్, సూర్యనారాయణ, జీవీవీ సత్యనారాయణ, ఎండీ నజీరుద్దీన్ తదితరులను ప్రాథమిక చికిత్స అనంతరం వారి గ్రామాలకు తరలించినట్టు తెలిసింది. అర్ధరాత్రి ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గండేపల్లి పోలీసులకు సమాచారం అందించారు. అయినప్పటికీ వారు స్పందించలేదని క్షతగాత్రులు ఆరోపించారు.
మెరుగైన వైద్యం అందించాలని
హోంమంత్రి ఆదేశం
ఈ రోడ్డు ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప వైద్యాధికారులను ఆదేశించారు. పెద్దాపురం ప్రభుత్వాస్పత్రి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
Advertisement