రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
Published Tue, Nov 15 2016 2:57 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
ఏలూరు రూరల్ : రోడ్డు ప్రమాదంలో ఓ ప్రయాణికుడు మరణించాడు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఏలూరు మండలం మల్కాపురం ఆటోనగర్ వద్ద సోమవారం ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పాలకొల్లు సమీపంలోని గోపాలపురానికి చెందిన ఎనిమిది మంది తీర్థయాత్రలకు వెళ్లారు. తిరుగుప్రయాణంలో ద్వారకాతిరుమల వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో కృష్ణాజిల్లా గన్నవరం డిపోకు చెందిన బస్సు ఎక్కారు. ఈ బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇది ద్వారకాతిరుమలకు వెళ్తుండగా, ఉదయం 10 గంటలకు ఆశ్రం ఆసుపత్రి వద్ద ఏలూరు రోడ్డుపై నిలిచి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టింది. దీంతో బస్సులో కండక్టర్ వైపు కూర్చున్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. యాత్రికుల్లో జెడ్డు రత్తయ్య(55) మరణించాడు. కండక్టర్‌తో సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. రత్తయ్య తమ్ముడు ముత్తయ్య చేయి విరిగిపోయింది. మరో యాత్రికుడు తోట సూరిబాబుకు గాయాలయ్యాయి. మనమడు పుట్టినరోజు వేడుక కోసం భీమడోలులోని అల్లుడి ఇంటికి వెళుతున్న హనుమా¯ŒSనగర్‌కు చెందిన టి.జయలక్ష్మి, గోపాలపురానికి చెందిన మహిళా కండక్టర్ ఎస్.నాగలక్ష్మితోపాటు మరో ప్రయాణికుడు యాండ్ర దుర్గారావు గాయపడ్డారు. వీరికి ఆశ్రం ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఏలూరు ఆర్టీసీ డిపో సీటీఎం ఎస్. మురళీకృష్ణ ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. స్వామిమాల వేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ సురక్షితంగా ఉన్నారు. ఆయన నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని పలువురు ప్రయాణికులు ఆరోపించారు.
Advertisement