సిరిసిల్ల : ఎండాకాలం దొంగలకు కలిసొచ్చే కాలం. పగటిపూట ఎండ తీవ్రతకు ప్రజలు రాత్రి వేళల్లో సేదతీరడానికి ఆరుబయట, బంగ్లాలపై, పడుకోవడం లేదా ఇంట్లోనే కూలర్, ఫ్యాన్లు వాడుతుంటారు. వీటి శబ్దాలకు పక్కింట్లో ఏమి జరుగుతుందో తెలిసే వీలుండదు. మరోవైపు పిల్లలకు సెలవులు ఇవ్వడంతో కొంతమంది విహార యాత్రలకు వెళ్తుంటారు.
దీనినే అదునుగా చేసుకునే దొంగలు ఇంట్లో ఉన్న విలువైన అభరణాలు, వస్తువులను ఇట్టే చోరీ చేస్తున్నారు. చోరీలు జరక్కుండా పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నా..వారి ఆలోచనలకు చిక్కకుండా దొంగలు చాకచక్యంగా వారిపని చేసుకుపోతున్నారు. ఇటువంటి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీస్‌శాఖ కూడా సూచిస్తుంది. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరుసగా దొంగతనాలు జరుగుతున్న వైనంపై సాక్షి కథనం..
పోలీస్ వర్సెస్ దొంగలు
దొంగతనాలు నిలువరించడానికి పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పాత నేరస్థులపై డేగకన్ను వేశారు. అయినా..ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా ఏదో ఒకచోట దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఈవిషయంలో పోలీసులు నిందితుల వేటకై రెండు డాగ్ స్క్వాడ్స్ సహాయం తీసుకుంటూ.. ప్రతి ఠాణాలో గస్తీ బృందాలను తిప్పుతున్నారు. ఇంత పకడ్బందీగా పోలీసులు చర్యలు చేపట్టినా..దొంగలు అంతకు మించిన చాకచక్యంతో చోరీలకు పాల్పడుతూ..రక్షణ శాఖకు సవాల్‌గా మారారు.
పెద్దలన్నట్లు ‘దొంగోడికి చెప్పే లాభం’ అన్న సామెతను నేడు నయా దొంగలు మార్చేశారు. చెప్పులు కాదు.. సంచుల్లో పట్టేన్ని డబ్బులు... ఆపై ఆభరణాలు కొట్టేడానికి ఆధనికతను వాడుకుంటున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్ల తలుపులు పగులకొట్టి దొంగతనాలు పాత పద్ధతి కానీ ఇంటివాళ్లు ఉండగానే దొంగతానాలు జరిగే రోజులచ్చాయి.
వేసవి కాలంలో అధిక శాతం ప్రజలు డాబాలపై, బిల్డింగ్ స్లాబ్‌లపై సేద తీరుతుంటే దొంగలు వారి పని వాళ్లు చేసుకెళ్లే ప్రమాదం ఉంది. చిన్నపిల్లలు ఏడుస్తున్నట్లు శబ్ధాలు చేయించి ఇళ్లును దోస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది. అభివృద్ది కోసమే ఆధునికి పరికరాలను దొంగలు వాడుకుంటూ ఎంచక్కా వారి పని కానిస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పోలీసుల రికార్డులో పదుల సంఖ్యలో కేసులు నమోదు కాగా..సుమారు వందకు పైగా చిల్లర దొంగతనాలపై పోలీసులకు సమాచారం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.
అంతరాష్ట్ర ముఠాల పనేనా..?
జిల్లాలో జరగుతున్న వరస దొంగతనాలకు అంతరాష్ట్ర ముఠాల పనేనా అన్న అనుమానాలు ప్రజలు, పోలీసు శాఖను కలవర పరుస్తుంది. దొంగల ముఠాలు ఖరీదైన కాలనీల్లో తాళం వేసి ఉన్న ఇంటిని గుర్తించేందుకు కాలనీ పరిసరాల్లోనే రెక్కీ నిర్వహిస్తాయి. ఇంటికి ఎలా వెళ్లాలో... ఎలా దోచుకెళ్లాలో ప్రణాళికలు సిద్ధం చేసుకుని అర్ధరాత్రి సమయంలో చోరీలకు పాల్పడుతుంది. తాళాలు పగుల కొట్టడం, కిటికీల గ్రిల్స్ విరచడం వంటి చేసి దొంగతనం లోనికి ప్రవేశానికి దారులు కనుగొంటారు. నిమిషాల వ్యవధిలో దొంతనాలు చేయడానికి పక్కగా ప్లాన్ వేసి వారి వారు పని కానిస్తారు.
అసలే ఖరీదైన కాలనీ కాసులుండేవాళ్లు వారి ఇంటిలో జరిగిన విషయాలను బయటకు చెబితే వారి పరువే పోతుందన్న ధీమాతో దొంగతనాలకు అనువైన స్థలాలుగా ఎంచుకునే అవకాశాలు లేకపోలేదు. ఒక్కో ముఠా ఒక్కో తరహాలో నేరాలకు పాల్పడే అవకాశాలున్నాయి. కొందరు బ్యాంకుల వద్ద మాటు వేసి డబ్బులు తీసుకెళ్లేవారిని గమనించి వెంటాడుతారు. డబ్బు కింద పడేసి, ఏదో రంగు చల్లి ఆ పరదాన్యంలో ఉన్న వారి నుంచి డబ్బులు కొట్టేసి పారిపోతారు. రాత్రి పూట మేడలపై నిద్రిస్తుంటే కింది భవనంలో చడీచప్పుడు కాకుండా చోరీలు చేస్తారు. కొందరు నకిలీ బంగారాన్ని అధిక మొత్తంలో ఇచ్చిన అసలు బంగారాన్ని, లేదంటే డబ్బును అప్పన్నంగా దండుకుంటారు.
జిల్లాలో ఇటీవల జరిగిన చోరీలు
“మార్చి 16న వేములవాడ మండలం జయవరంలో దొంగలు ట్రాక్టర్ బ్యాటరీలు ఎత్తుకెళ్లారు.
“మార్చి 22న కోనరావుపేట మండలం కొలనూరులో ద్విచక్రవాహనం చోరీ జరిగింది.
“మార్చి 29న ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో బైక్ దొంగతనం చేశారు.
“ఏప్రిల్ 13న బోయిన్‌పల్లి మండలం జగ్గారావుపల్లె పెద్దమ్మ, గురుదత్తాత్రేయ ఆలయాల్లో ఎనమిది వెండి కళ్లు, పావుతులం బంగారం, హుండీల్లోని నగదు దొంగల పాలైంది.
“ఏప్రిల్ 18న ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో ఒకేరోజు నాలుగు ఇండ్లలో రూ.80వేల నగదు, మూడున్నర తులాల బంగారం, ఒక ద్విచక్ర వాహనం దొంగతనం జరిగింది. అదే రోజు సిరిసిల్ల కొత్తచెరువు వద్ద ఆటోమోబైల్ షాపులో దొంగలు పడ్డారు.
“ఈనెల 19 జిల్లా కేంద్రం సిరిసిల్లలోని సంజీవయ్యనగర్‌లో ఎనమిదిన్నర తులాల బంగారం, రూ.1.75 లక్షల నగదును దొంగలు అపహరించారు.
“ ఈనెల 20న వీర్నపల్లి మండలం గర్జనపల్లి తండాలో రూ.90 నగదుతో పాటు తులంన్నర బంగారం దొంగలించారు.
– దొంగల నుంచి రక్షణ ఇలా..
– ప్రతీ ఇంటికి సీసీ కెమెరాలు అమర్చుకోవడం. లేదంటే కాలనీలో సీసీ కెమెరాలు అమర్చాలన్న విధానంలో సంబంధిత అధికారులను కోరితే ఏదేని జరిగినా పూటేజీతో దొంగలను పట్టవచ్చు.
– తాళం వేసి ఊరి వెళ్తే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో వివరాలను తెలియచేస్తే పెట్రోలింగ్ వాహనాన్ని శాఖాధికారులు ఎక్కువ సార్లు గస్తీ చేయించే వీలుంటుంది.
– రోజువారీ ఖర్చులకు సంబంధించిన వరకే డబ్బును, ఆభరణాలు ఉంచుకుని మిగితావి బ్యాంకులో సురక్షితంగా లాకర్‌లో ఉంచితే మేలు.
– వేసవి కాలంలో ఆరుబయట నిద్రించే వారు తప్పనిసరిగా ఇంటికి తాళం వేయాలి. బంగారు ఆభరణాలు ధరించకపోవడం మంచిది.
– టూర్లకు, బం«ధువులు ఇంటికి వెళ్లే సమయంలో ఎవరైనా ఒకరు ఇంటి వద్ద ఉండేట్లు చూసుకుంటే మేలు
– పరిచయం లేని వ్యకులు, అనుమాస్పదంగా తిరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.
– వేసవిలో తాగునీటి సమస్య అధికంగా ఉంటుంది. ఏ సమయంలోనైనా పరిచయం లేని వ్యక్తులు ఇచ్చే నీళ్లు, ఆహారం పదార్థాలు తినేద్దు దానిలో మత్తు పదార్థాలు కలిపి మోసం చేసే అవకాశం ఉంది.
పెట్రోలింగ్ అధికం చేస్తాం.. గస్తీ చేయిస్తాం..విశ్వజిత్ కంపాటి, ఎస్పీ, రాజన్న సిరిసిల్ల జిల్లా
వేసవి సెలవులో ఇంటిలో ఎవరు లేని చూసి దొంగలు వారి చేతివాటాన్ని చూపుతారు. దానికి ప్రతి సంవత్సరం కరపత్రాలు పంచడం వంటివి శాఖ పక్షాన చేస్తున్నారు. వీటితోపాటు వేసవి సెలవుల్లో పెట్రోలింగ్‌ను అధికం చేయిస్తునే... గస్తీ చేయడానికి పలు బీట్స్‌ను ఏర్పాటుకు అన్ని ఠాణాలకు ఆదేశాలిచ్చాం. దొంగలను జరగకుండానే జాగ్రత్తలు చేస్తాం. జరిగిన పట్టుకునే స్థాయిలో ఇటీవల జరిగిన బదిలీల్లో ఫోర్స్‌ను ఠాణాలకు అందించాం.