బిట్రగుంట : బోగోలు మండలం కడనూతలలో అంగన్‌వాడీ కేంద్రం నిర్వాహకురాలు బుడంపాటి బాలాత్రిపురసుందరిని ప్రత్యేకాధికారి పేరుతో గుర్తుతెలియని వ్యక్తి బెదిరించి బీరువాలోని బంగారు నగలు దోచుకెళ్లిన సంఘటన స్థానికంగా శనివారం కలకలం సృష్టించింది.
-
21.4 సవర్ల బంగారు నగలు లూటీ
బిట్రగుంట : బోగోలు మండలం కడనూతలలో అంగన్‌వాడీ కేంద్రం నిర్వాహకురాలు బుడంపాటి బాలాత్రిపురసుందరిని ప్రత్యేకాధికారి పేరుతో గుర్తుతెలియని వ్యక్తి బెదిరించి బీరువాలోని బంగారు నగలు దోచుకెళ్లిన సంఘటన స్థానికంగా శనివారం కలకలం సృష్టించింది. బాధితురాలు, పోలీసుల కథనం మేరకు.. కడనూతలలో అంగన్‌వాడీ కేంద్రం నిర్వాహకురాలిగా విధులు నిర్వహించే బాలత్రిపుర సుందరి వద్దకు ద్విచక్రవాహనంపై గుర్తుతెలియని వ్యక్తి వచ్చాడు. నేరుగా అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చిన ఆగంతకుడు కలెక్టర్ కార్యాలయం నుంచి విచారణ కోసం వచ్చిన ప్రత్యేకాధికారి అజయ్‌గా పరిచయం చేసుకున్నాడు. కేంద్రంలోని రికార్డులన్నీ పరిశీలించి పచ్చ ఇంకుతో రిమార్కులు రాయడంతో పాటు అంగన్‌వాడీ కేంద్రాని సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. అక్రమాలు చోటు చేసుకున్నాయని బెదిరిస్తూ అంగన్‌వాడీ కేంద్రం నిర్వాహకురాలితో పాటు ఆయా దగ్గర ఉన్న సెల్‌ఫోన్లు తీసుకుని స్విచ్చాఫ్ చేయించాడు. అంగన్‌వాడీ కేంద్రం నిర్వాహకురాలి ఇంట్లో తనిఖీలు చేయాలంటూ ఇంటి వద్దకు వచ్చి బీరువాలో నగలన్నీ బయటకు తీయించాడు. మొత్తం 21.4 సవర్ల బంగారాన్ని సీజ్ చేసినట్లు నటించి కలెక్టర్ కార్యాలయానికి వచ్చి రికార్డులు చూపించి నగలు తీసుకువెళ్లాలంటూ బైక్‌పై ఉడాయించాడు. కొద్దిసేపటికి తేరుకున్న త్రిపురసుందరి మోసపోయినట్లు గుర్తించి బిట్రగుంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.