ఐలూరు రామేశ్వరాలయంలో దోపిడీకి గురైన పంచలోహ విగ్రహాలు లభ్యం
బ్యాగులో గ్రామశివారున పడేసిన ఆగంతకులు
నెలకిందటే దోపిడీ ఘటన
పురాతన ఆలయంలో అత్యంత విలువైన పంచలోహ విగ్రహాల చోరీ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు విగ్రహాలను ఒక బ్యాగులో గ్రామశివారులో భద్రంగా వదిలివెళ్లారు. దొంగలెవరు.. ఎందుకు తిరిగి ఇచ్చారు... దీని వెనుక కథేంటి అనేది పెద్ద మిస్టరీగా మారింది.
తోట్లవల్లూరు : పామర్రు నియోజకవర్గం ఐలూరులోని దక్షిణ కాశీగా పేరుపొందిన సుప్రసిద్ధ శ్రీగంగాపార్వతీ సమేత శ్రీరామేశ్వరస్వామి ఆలయంలో అపహరణకు గురైన పంచలోహ విగ్రహాలు అత్యంత నాటకీయంగా లభ్యం కావడంతో భక్తుల్లో ఆనందం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే... గత నెల 26న ఆలయ తాళాలు పగులగొట్టి సుమారు 400 ఏళ్లనాటి రామేశ్వరస్వామి, పార్వతీదేవి, చండేశ్వరస్వామిల పంచలోహ విగ్రహాలను దొంగలు అపహరించారు.
అధికారికంగా వీటి ఖరీదు రూ. 2 లక్షలు మాత్రమే అయినప్పటికీ, వీటి విలువ అమూల్యమని పండితుల చెబుతున్నారు. అప్పట్లో దోపీడి విషయం తెలియగానే పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ తాతినేని పద్మావతి, ఎంపీపీ కళ్లం వెంకటేశ్వరరెడ్డి ఆలయాన్ని సందర్శించారు. దీనిపై విజయవాడ పోలీస్‌కమీషనర్ గౌతంసవాంగ్‌ను కలిసి దోపిడీదొంగలను పట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.
దొంగలను పట్టుకోవాలి
విగ్రహాల దోపిడీ దొంగలను పట్టుకోవాలని జెడ్పీ ఫ్లోర్‌లీడర్ తాతినేని పద్మావతి డిమాండ్ చేశారు. విగ్రహాలు లభ్యం కావటం సంతోషం. అలాగే దోపిడీకి పాల్పడ్డ దొంగలను కూడా వెంటనే గుర్తించి భవిష్యత్తులో ఇలా జరగకుండా అరెస్టు చేయాలి.
-తాతినేని పద్మావతి
చిన్న కట్ట వెంబడి బ్యాగులో విగ్రహాలు
మంగళవారం తెల్లవారుజామున గ్రామంలోని రెండు వంతెనల మధ్య చిన్నకట్ట వెంబడి ఓ బ్యాగును ఆగంతకులు వదిలివెళ్లారు. ఉదయాన్నే బహిర్భూమికి వెళ్లిన చిన్నారులు బ్యాగును గుర్తించి స్థానికులకు తెలిపారు. ఎస్‌ఐ ప్రసాద్, గ్రామస్తులు కలిసి బ్యాగును తెరిచి పరిశీలించగా అపహరణకు గురైన మూడు విగ్రహాలు కనిపించాయి. ఆలయ ఉద్యోగి ప్రసాద్‌ను పిలిపించి అవి పోయిన విగ్రహాలేనని నిర్ధరించారు. విగ్రహాల దోపిడీపై పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో దొరికిపోతామనే భయంతోనే దొంగలు విగ్రహాలు విడిచివెళ్లారా, లేక మరేవైనా కారణాలున్నాయా? అనేది మిస్టరీగా మారింది. అయినప్పటికీ దొంగలను పట్టుకుంటామని ఎస్‌ఐ ప్రసాద్ విలేఖరులకు తెలిపారు.