తిన్నింటి వాసాలు లెక్కపెట్టే ఘనుడు | rowthu fire | Sakshi
Sakshi News home page

తిన్నింటి వాసాలు లెక్కపెట్టే ఘనుడు

Published Thu, Jun 15 2017 12:15 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

తిన్నింటి వాసాలు లెక్కపెట్టే ఘనుడు - Sakshi

తిన్నింటి వాసాలు లెక్కపెట్టే ఘనుడు

  • ఎమ్మెల్సీ ఆదిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే రౌతు ధ్వజం 
  • అభివృద్ధి అంటే అధికారం కోసం పార్టీ మారడం కాదంటూ చురక 
  • సిగ్గుంటే వైఎస్సార్‌సీపీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేయాలి
  • సాక్షి, రాజమహేంద్రవరం :
    తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నైజంతో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ప్రవర్తిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, రాజమహేంద్రవరం నగర వైఎస్సార్‌సీపీ కో ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా ఆదిరెడ్డి అప్పారావు వైఎస్సార్‌సీపీ ద్వారా ఎమ్మెల్సీ పదవి తీసుకుని తిరిగి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి అంటే అధికారం కోసం పార్టీ మారడం కాదంటూ చురక అంటించారు. నైతిక విలువలనేవి ఉంటే వైఎస్సార్‌సీపీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని సవాల్‌ విసిరారు. వైఎస్‌ జగన్‌ పెట్టిన బిక్షతో ఎమ్మెల్సీ అయ్యావన్న విషయం గుర్తుంచుకోవాన్నారు. మూడేళ్లు పూర్తయి నాలుగో ఏట అడుగుపెడుతున్న టీడీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని గుర్తు చేశారు. రాజమహేంద్రవరంలో కట్టిన వేల ఇళ్లు వైఎస్‌ఆర్‌ హయాం లోనివనే విషయం గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. ఐఎల్‌టీడీ జంక్షన్‌ వద్ద ఫ్లై ఓవర్, గామన్‌ బ్రిడ్జి కూడా వైఎస్‌ హయంలో నిర్మించినవేనని పేర్కొన్నారు. పుష్కరాల సమయంలో రాజమహేంద్రవరంలో కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మిస్తామంటూ శంకుస్థాపనలు చేసి రెండేళ్లవుతున్నా ఇప్పటి వరకు అతీగతీ లేదన్నారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలు దండగని ‘కాగ్‌’ అంక్షింతలు వేసిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. పట్టిసీమ ప్రయోజనంపై దమ్ముంటే ఎవరైనా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో చర్చకు సిద్ధమవ్వాలని సవాల్‌ విసిరారు. సమావేశంలో కార్పొరేటర్‌ బొంతా శ్రీహరి, మజ్జి నూకరత్నం, మాజీ ఫ్లోర్‌లీడర్‌ పోలు విజయలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు వాకచర్ల కృష్ణ, భీమవరపు వెంకటేశ్వరరావు, పార్టీ నగర ప్రధాన కార్యదర్శి దంగేటి వీరబాబు, పార్టీ నేతలు పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, మాసా రామజోగ్, మజ్జి అప్పారావు, పెంకె సురేష్, కుక్కా తాతబ్బాయి, బాషా, కాటం రజనీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement