
అవన్నీ పుకార్లే
రూ.10 కాయిన్‌లు చెల్లుతాయి
వ్యాపారులు నిరభ్యతరంగా తీసుకోవచ్చు
ఎవరైనా తీసుకోకపోతే నేరంగా పరిగణిస్తాం
తేల్చిచెప్పిన బ్యాంకు ఉన్నతాధికారులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. అయినా రూ. 10 కాయిన్లు మారవంటూ 10–15 రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ ప్రభావం ప్రజలు, చిన్నచితకా వ్యాపారులపై తీవ్రంగా చూపుతోంది. చివరకు కొందరు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావి వర్గాలు సైతం రూ.10 కాయిన్లు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారంటే వీటిపై దుష్ర్పచారం ఎంతగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. రూ. 10 కాయిన్ మారకంపై జనంలో అపోహలు ఎంత మేర ప్రభావం చూపుతున్నాయో పై రెండు ఉదాహరణలు అద్దం పడుతున్నాయి.
- అనంతపురం/అగ్రికల్చర్
--------------------------------
అమ్మవారి ఫొటో ఉంటే చెల్లదట
రూ. 10 కాయిన్లపై కొందరు పని గట్టుకుని ప్రచారం చేస్తుండడంతో ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. దీనికి తోడు కొన్ని బ్యాంకుల్లో సిబ్బంది రూ. పది కాయిన్లు తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే వాటిని లెక్కించడం వారికి ఇబ్బందిగా ఉంటోంది. ఇలాంటి తరుణంలోనే బ్యాంకర్లు వాటిని తిరస్కరిస్తున్నారని, అవి చెల్లవంటూ కొందరు దుష్ర్పచారం చేపట్టారు. ముఖ్యంగా అమ్మవారి ఫొటో ఉన్న కాయిన్లు, పదికి మించి లైన్లు ఉన్న కాయిన్లు చెల్లవంటూ రకరకాల ప్రచారం ఊపందుకుంది. అయితే వీటిని బ్యాంకు అధికారులు కొట్టి పడేస్తున్నారు. రూ.10 కాయిన్లపై ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేస్తున్నారు.
అపోహలు నమ్మొద్దు
రూ.10 కాయిన్లు తీసుకోకపోతే నేరమే అవుతుంది. వాటిని రద్దు చేస్తున్నట్లు కాని, ఇతరత్రా చెల్లుబాటు కావనే ఉత్తర్వులు ఆర్‌బీఐ నుంచి రాలేదు. నిరభ్యంతరంగా బ్యాంకులు, వ్యాపారులు, ప్రజలు లావాదేవీలు చేసుకోవచ్చు. అపోహలు నమ్మకుండా వాటిని పరస్పరం మార్పిడి చేసుకోవాలి.
– పి. అమ్మయ్య, ఆంధ్రాబ్యాంకు చీఫ్ మేనేజర్, అనంతపురం
చెల్లుబాటు అవుతాయి.
రూ.10 కాయిన్స్ చెల్లుబాటు రద్దు చేస్తున్నట్లు ఆర్‌బీఐ నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. నిరభ్యంతరంగా చెలామణి చేసుకోవచ్చన్నారు. వ్యాపారులు కూడా వదంతులు నమ్మకుండా కాయిన్స్ తీసుకోవాలి. ఖాతాదారులు ఎవరైనా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే ఇదే అదనుగా సంచులు సంచులు తీసుకువస్తే సిబ్బంది కొరత, సమయాభావం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి.
- శ్రీనివాసరావు, ఏజీఎం, ఎస్‌బీఐ, అనంతపురం