కార్పొరేషన్లకు ఏటా రూ.100 కోట్లు | Rs 100 crore annually to corporations | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్లకు ఏటా రూ.100 కోట్లు

Published Tue, Feb 16 2016 8:10 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

కార్పొరేషన్లకు ఏటా రూ.100 కోట్లు - Sakshi

కార్పొరేషన్లకు ఏటా రూ.100 కోట్లు

ఖమ్మం, రామగుండం, కరీంనగర్, నిజామాబాద్‌లకు కేటాయిస్తాం: సీఎం కేసీఆర్
ఖమ్మంలో పర్యటించిన సీఎం.. అధికారులతో సమీక్ష

 
 సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం, రామగుండం, కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లు ఒక్కోదానికి బడ్జెట్‌లో ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో రూ.5.70 కోట్లు, వరంగల్ నగర పాలక సంస్థ పరిధిలో రూ.3.50 కోట్ల ఆస్తి పన్ను పెనాల్టీని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. రెండ్రోజుల పర్యటన కోసం సోమవారం ఖమ్మం వచ్చిన సీఎం.. నగరంలో విస్తృతంగా పర్యటించారు. అనంతరం అధికారులతో జిల్లా పథకాల అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఉమ్మడి రాష్ట్రంలో కార్పొరేషన్లు నిర్లక్ష్యానికి గురయ్యాయని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో భక్తరామదాసు, సీతారామ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నామని, భక్త రామదాసు ప్రాజెక్టుకు ఇప్పటికే రూ.100 కోట్లు మంజూరు చేశామని వివరించారు. వచ్చే జూన్, జూలై నాటికి పనులు పూర్తి చేసి ఈ ఎత్తిపోతల పథకం పరిధిలో 60 వేల ఎకరాలకు నీరందిస్తామన్నారు. భద్రాచల సీతారాముడి ఆశీస్సులతో చేపడుతున్న సీతారామ ప్రాజెక్టును రెండున్నరేళ్లలో పూర్తి చేసి 5 లక్షల ఎకరాలకు నీరందిస్తామన్నారు. గతంలో చేపట్టిన రుద్రమకోట ఏపీలోకి వెళ్లడంతో సీతారామ ప్రాజెక్టు చేపట్టామని, దీన్ని బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మారుస్తామన్నారు.

కృష్ణా, దాని ఉప నదులపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో 200లకు పైగా ప్రాజెక్టులు నిర్మించారని, దీనివల్ల నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు ప్రమాదం ఉందని, నాలుగేళ్ల వరకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. వర్షాలు పడి అక్కడి ప్రాజెక్టులు నిండితేనే ఇక్కడికి నీరు వస్తుందన్నారు. ఈ ఉద్దేశంతోనే గోదావరి నీటిని ఉపయోగించుకునేందుకు ప్రాణహిత, ఇంద్రావతి ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఖమ్మం జిల్లాకు ఉపయోగపడేలా దుమ్ముగూడెం వద్ద 350 రోజులు 5వేల క్యూసెక్కుల నీటి లభ్యత ఉంటుందని, ఈ నీటితో ఎన్నెస్పీ ఆయకట్టుకు కూడా నీటిని అందించేలా డిజైన్ చేశామన్నారు. భద్రాచలం డివిజన్ నుంచి ఏపీలో కలిసిన నాలుగు గ్రామ పంచాయతీలను తెలంగాణకు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించిందని సీఎం తెలిపారు. రానున్న బడ్జెట్ నాటికి ఈ పంచాయతీలు తెలంగాణలోకి వస్తాయన్నారు. భద్రాచ లం పుణ్యక్షేత్రాన్ని వేములవాడ, యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. భద్రాచలంకు చిన్నజీయర్ స్వామిని తీసుకొచ్చి క్షేత్రం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

 అదనంగా 3 వేల డబుల్ బెడ్‌రూమ్‌లు...
 ఖమ్మంకు ఇప్పటికే 2 వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేశామని, ఈ బడ్జెట్‌లో మరో 3 వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామని సీఎం వెల్లడించారు. వచ్చే ఏడాదిలో ఈ ఇళ్లన్నీ నిర్మిస్తామన్నారు. నగరంలో ప్రభుత్వ కార్యాలయాలు వేర్వేరు చోట్ల ఉన్నాయని, వీటన్నింటినీ ఒకేచోటకు తెచ్చేలా సమీకృత కార్యాలయాలను నిర్మిస్తామని వివరించారు. ఎన్నెస్పీలోని 39 ఎకరాల్లో ఈ కార్యాలయాలను నిర్మిస్తామన్నారు. ఖమ్మంలో కూరగాయల మార్కెట్, మాంసపు మార్కెట్ల కోసం 73 ఎకరాల్లో 6 మార్కెట్లను మంజూరు చేస్తామన్నారు. మున్సిపల్ కార్యాలయానికి కూడా కొత్త భవనం నిర్మిస్తామని చెప్పారు.

లకారం చెరువును మినీ ట్యాంక్‌బండ్‌లా తీర్చిదిద్దేందుకు అదనపు నిధులిస్తామని, వెలుగుమట్ల ఫారెస్ట్ బ్లాక్‌ను హైదరాబాద్ కేబీఆర్ పార్కులా తీర్చిదిద్దుతామన్నారు. ఖమ్మం చుట్టూ రింగురోడ్డు నిర్మిస్తామని చెప్పారు. మిషన్ భగీరథను పూర్తిచేసి డిసెంబర్ నాటికి ఖమ్మంలో మంచినీటి సమస్య ఉండకుండా చూస్తామన్నారు. హైదరాబాద్, వరంగల్ తరహాలో ఖమ్మం కేంద్రంలో జర్నలిస్టులకు ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. స్థలం చూస్తే ఈ బడ్జెట్‌లోనే నిధులు కేటాయిస్తామన్నారు. అలాగే ఖమ్మం ప్రెస్‌క్లబ్‌కు ఎకరం స్థలం కేటాయిస్తామని, అందుకు స్థలం చూడాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
 
 కొత్తగూడెంలో మైనింగ్ వర్సిటీ
 కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీ లేదా ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు. జిల్లాల పునర్విభజన తర్వాత వర్సిటీ ఎక్కడ పెట్టాలో నిర్ణయిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాలు పునర్విభజన తర్వాత 153 అవుతాయన్నారు. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు న్యాయం చేసేలా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఖమ్మంలో హమాలీలు, గ్రానైట్ కార్మికులు, కూలీలు పెద్ద సంఖ్యలో ఉన్నారని, నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో 300 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉందని, అందులో వీరికి ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. ఇప్పుడున్న షాదీఖానా బాగాలేదని ముస్లింలు తన దృష్టికి తెచ్చారని, రూ.2 కోట్లతో మరో షాదీఖానా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. భక్త రామదాసు కళాక్షేత్రాన్ని కూడా ఆధునీకరిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement