రూ.3 లక్షల ఆస్తినష్టం
కాలిబూడిదైన రూ.50వేల నగదు, వెండి ఆభరణాలు
కిచ్చన్నపల్లిలో ఘటన
జోగిపేట: అందోలు మండలం కిచ్చన్నపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ ఇళ్లు దగ్ధమైంది. గురువారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో సుమారు రూ.3 లక్షల విలువ చేసే ఆస్తినష్టం జరిగింది. బాధితుల కథనం ప్రకారం... కిచ్చన్నపల్లికి చెందిన అలవేణి ఇంట్లో ఆమెతోపాటు పాటు తండ్రి కిష్టయ్య, కొడుకు జోగినాథ్, ఆమె సోదరి సావిత్రి, చిన్నారులు దివ్య, శిరీష గురువారం రాత్రి నిద్రించారు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో గుడిసెకు నిప్పంటుకోవడంతో నిప్పు మెరుగులు సావిత్రిపై పడ్డాయి.
మేల్కొన్న ఆమె మంటలను గమనించింది. వెంటనే అందరిని నిద్రలేపగా బయటకు పరుగులు తీశారు. దివ్య అనే బాలిక నిద్రలోనే ఉండిపోవడంతో గుర్తించిన స్థానికులు ఆమెను బయటకు తీసుకొచ్చారు. ఆ వెంటనే గుడిసె మొత్తం కాలిపోయింది. ఈ ప్రమాదంలో రూ.50 వేల నగదు, 60 తులాల వెండి, రెండు తులాల బంగారు చెవుల కమ్మలు, మూడు క్వింటాళ్ల బియ్యం, రెండు క్వింటాళ్ల జొన్నలు, 50 కిలోల పెసర్లు, ఇతర పత్రాలు తగలబడి పోయినట్లు బాధితులు తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే తమ ఇంటికి నిప్పంటించారని వారు ఆరోపించారు. మూడు నెలల క్రితం కూడా ఇంటికి నిప్పంటించారనన్నారు. అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని వారు కోరారు.