ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. విద్యార్థులు కూర్చోవడానికి బల్లలు, మరుగుదొడ్లతోపాటు ఆడుకోవడానికి కనీస సౌకర్యాలు కల్పించడానికి రూ. 5,000 కోట్లతో బడ్జెట్ తయారుచేసినట్లు తెలిపారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఏర్పాటుచేసిన ‘సర్వ శిక్షాభియాన్’ రాష్ట్ర పథక సంచాలకుల కార్యాలయాన్ని మంత్రి గురువారం ప్రారంభించారు.
అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించే విధంగా పలు సంస్కరణలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి పాఠశాలల్లో తప్పనిసరిగా ‘వసంతోత్సవం’ పేరిట వార్షిక వేడుకలను నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. కేవలం చదువే కాకుండా ఆటపాటలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘వనం-మనం’లో విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారని, మొక్కలు నాటి వాటిని బాగా పెంచినవారికి గ్రేస్ మార్కులు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ రామకృష్ణ, సర్వ శిక్షాభియాన్ పథక సంచాలకులు జి.శ్రీనివాస్‌తో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు.