సాగునీటి కోసం రూ.5 వేల కోట్లు
ఏలూరు (మెట్రో) : జిల్లాలో ప్రతి సెంటు భూమికి సేద్యపు నీరు అందించడానికి రూ.5 వేల కోట్లతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినట్టు జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఎంహెచ్.షరీఫ్ తెలిపారు. బిందు సేద్యం అమలు తీరుపై వివిధ కంపెనీ ప్రతినిధులతో మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో సమీక్షించారు. జిల్లాలో సేద్యపునీరు అవసరాలకు పూర్తి స్థాయిలో నీటి వనరులను సమకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయగా ప్రతిపాదన పంపించినట్టు చెప్పారు. జిల్లాలో 2017–18 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, ఉద్యానవన పంటల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. గతేడాది 13 వేల హెక్టార్లలో బిందు సేద్యాన్ని అమలు చేసి రైతులకు మరింత చేరువ అయ్యామని, ఈ ఏడాది మిగిలిన 45 వేల హెక్టార్లలో అమలు చేసి జాతీయస్థాయిలో రికార్డు సృష్టించాలన్నదే కలెక్టర్ అభిమతమన్నారు. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్.రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో 22 కంపెనీ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరై తమ పరిధిలో డ్రిప్ ఇరిగేషన్ అమలు చేయడానికి ముందుకు వచ్చారన్నారు. ఏపీఎంఐసీ ఓఎస్‌డీలు బి.రవీంద్రబాబు, డి.రమేష్ పాల్గొన్నారు.