ఆర్టీసీ ప్రెస్ నుంచే బోగస్ సర్టిఫికెట్లు!
♦ సిబ్బంది ముఠాగా ఏర్పడి దందా
♦ తొలుత కొందరు డాక్టర్ల సహకారం ఉన్నట్లు అనుమానం
♦ రెండు నెలల్లో వెయ్యి వరకు నకిలీ సర్టిఫికెట్ల జారీ
♦ విజిలెన్స్ విచారణకు ఆర్టీసీ జేఎండీ ఆదేశం
♦ బాధ్యులపై క్రిమినల్ కేసుల నమోదుకు నిర్ణయం
♦ ఆర్టీసీలో దుమారం రేపిన ‘సాక్షి’ కథనం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో చోటుచేసుకున్న బోగస్ మెడికల్ సర్టిఫికెట్లు, బిల్లుల దందాలో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగు చూస్తున్నాయి. బోగస్ బిల్లులకు స్వయంగా ఆర్టీసీ ప్రింటింగ్ ప్రెస్ వేదిక కావటం విశేషం. మియాపూర్‌లో ఉన్న ఆర్టీసీ సొంత ప్రింటింగ్ ప్రెస్ నుంచే ఈ బోగస్ బిల్లులు బయటకు తరలినట్టు తెలుస్తోంది. మూడు నాలుగు డిపోలకు చెందిన కొందరు సిబ్బంది ముఠాగా ఏర్పడి ఈ దందాను నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఒక రోజు సెలవుకు రూ.200 చొప్పున వసూలు చేస్తూ ఒక్కోరోజు ఏకంగా వంద వరకు బోగస్ పత్రాలను సృష్టించినట్టు సమాచారం. ‘విధులకు రాకున్నా టంచన్‌గా జీతం’ శీర్షికతో ఈ బాగోతాన్ని గురువారం ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీనికి వెంటనే స్పందించిన ఆర్టీసీ జేఎండీ రమణారావు, గ్రేటర్ జోన్ ఈడీ పురుషోత్తం నాయక్‌తో పాటు రీజనల్ మేనేజర్లతో సమావేశమై చర్చించారు. ఇది సాధారణ విషయం కాదని, పెద్ద నేరమని పేర్కొన్న ఆయన బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు సమాచారం.
ఈ బాగోతంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయన విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించారు. దీంతో విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగి ప్రాథమికంగా కొందరు బాధ్యులను కూడా గుర్తించిం ది. వారిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తోంది. రెండుమూడు రోజుల్లో దీనిపై స్పష్టత రాను ందని, అప్పుడు బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశముందని తెలుస్తోంది.
డాక్టర్ల హస్తం?
ఈ బోగస్‌సర్టిఫికెట్లు, బిల్లుల వ్యవహారంలో తార్నాకలోని ఆర్టీసీ వైద్యశాల డాక్టర్ల హస్తం కూడా ఉంటుందని విజిలెన్స్ విభాగం అనుమానిస్తోంది. తొలుత కొందరు ఉద్యోగులు కొద్దిమంది డాక్టర్లతో కుమ్మక్కై బోగస్ సర్టిఫికెట్లు రూపొందించారని, తర్వాత ఉద్యోగులే సొంతంగా వాటిని రూపొందించే స్థాయికి చేరుకున్నారని గుర్తించింది. మియాపూర్ ప్రింటింగ్ ప్రెస్ నుంచే ఆసుపత్రికి ఖాళీ బిల్లులు, సర్టిఫికెట్లు సరఫరా అవుతున్నాయని, వాటిని సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా బయటకు తరలించి యథేచ్ఛగా ఉద్యోగులకు అందజేస్తున్నట్లు గుర్తించారు. ప్రింటింగ్ ప్రెస్ సిబ్బంది పాత్రపై కూడా కూపీ లాగుతున్నారు. గత రెండు నెలల్లో దాదాపు వెయ్యి బోగస్ సర్టిఫికెట్లు చేతులు మారినట్లు భావిస్తున్నారు. సర్టిఫికెట్లకే ఈ దందా పరిమితమైందా...? మరేదైనా నేరానికి కూడా పాల్పడి ఉంటారా? అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది.
క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం
‘‘ఇది పెద్ద నేరం. బాధ్యులైన సిబ్బందిని వదిలిపెట్టం. విజిలెన్స్ దర్యాప్తులో మరో రెండుమూడు రోజుల్లో నిజాలు తెలుస్తాయి. దాని ఆధారంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలనుకుంటున్నాం. ఈ దందాపై లోతుగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ’’
-టీఎస్‌ఆర్టీసీ జేఎండీ రమణారావు