విజయవాడ (బస్‌స్టేషన్) :
కృష్ణాపుష్కరాలకు యాత్రికులను తరలించేందుకు ఆర్టీసీ కీలక పాత్ర పోషించింది. ఆర్టీసీ అధికారులు పక్కా ప్రణాళికతో ఇతర జిల్లాల నుంచి కూడా బస్సులను రప్పించి భక్తులకు సేవలు అందించారు. బస్సులను బుధవారం తిరిగి స్వస్థలాలకు పంపించడంతో ‘ఆపరేషన్ పుష్కర’ విజయవంతంగా ముగిసింది. అధికారులు, సిబ్బంది మధ్యాహ్నం భోజనం చేసి తమ గమ్యస్థానాలకు ఆయా బస్సుల్లో చేరుకున్నారు.
పుష్కరాలకు1800 ఆర్టీసీ బస్సులు
పుష్కరాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ 1800 బస్సులు నడిపింది. జిల్లాలోని అన్ని డిపోల బస్సులు, ఇతర జిల్లాలకు చెందిన 800లకు బస్సులను నడిపారు. జిల్లాల వారీగా పుష్కర స్పెషల్ పేరుతో బస్సులను కేటాయించి యాత్రికులు పుష్కరాలకు వెళ్లే దిశగా ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా నడిచేటప్పుడు టికెట్టు తీసుకుని, నగర పరిధిలో ఘాట్లకు తరలించేందుకు ఉచితంగా బస్సుసర్వీసులు నడిపారు.
ఇతర జిల్లాలకు 831 బస్సులు
కృష్ణా రీజియన్‌కు సంబంధించిన బస్సులను శ్రీకాకుళం, విజయనగరానికి 75 బస్సులు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు 150 బస్సులు, విశాఖపట్నం75, గుంటూరుకు 100, ప్రకాశం 150, నెల్లూరుకు 150, ప్రకాశం 150, చిత్తూరుకు 75, కడపకు 15, కర్నూల్‌కు 25, అనంతపురానికి 16 చొప్పున నడిపి యాత్రికులను పుష్కరాలకు తరలించారు. రైలు ప్రయాణాలు చేయలేని చాలా మంది ఆర్టీసీవైపే అడుగులు వేశారు.
నగరంలో 900
ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన యాత్రికులను, నగరవాసులను పుష్కరాలకు తరలించడానికి ఆర్టీసీ ఉచిత సర్వీసులు నడిపింది. నగరపరిధిలో ఆరు శాటిలైట్ బస్‌స్టేషన్లు ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఆయా స్టేషన్ల నుంచి పుష్కరనగర్‌లకు, నగరపరిధిలో పలురూట్లనే కేటాయించి స్థానికులకు ఉచిత ప్రయాణాలు అందించడానికి, పవిత్ర సంగమంలో జరిగే హారతిని తిలకించేందుకు ఉచితంగా ఈ బస్సులను నడిపింది.
స్థానికులకు ఇబ్బందులు
అందరూ ఆర్టీసీ బస్సును ఆశ్రయించాలని అధికారులు సూచించారు. అయితే ఆర్టీసీ పుష్కర యాత్రికులకు ఇచ్చిన ప్రాధాన్యత స్థానికులకు ఇవ్వకపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. ఐదు నిమిషాలకో బస్సు అని ప్రచారం చేసి, అది శాటిలైట్ బస్‌స్టేషన్‌లోని యాత్రికులకే అన్నట్లుగా వ్యవహరించింది. దీంతో నగరవాసులు పుష్కరాలకు వెళ్లాలన్నా, పవిత్ర సంగమానికి వెళ్లాలన్నా గంటల తరబడి బస్‌స్టాపుల్లో నిలబడి ఉండిపోయారు. ఒన్‌టౌన్ నుంచి టూటౌన్‌కు రాకపోకలు సాగించాలన్నా కష్టమైంది. కనీసం పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు కూడా బస్సులు నడపలేదు. తొలిరోజుల్లో ఆటోల రూట్లను నియంత్రించి తర్వాత వదలడంతో స్థానిక నగరవాసులు ఆటోల్లోనే తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు.
ఆర్టీసీకి రూ.11 కోట్లు ఖర్చు
పుష్కరాలను పురస్కరించుకుని ఆర్టీసీ సుమారు రూ.11 కోట్లు ఖర్చు పెట్టినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అధికారులు, సిబ్బంది డ్యూటీ నిమిత్తం వారి జీతాలతో లెక్కించగా బస్సులో వాడిన ఇంధనం, ఆక్యుపెన్సీ, శాటిలైట్ బస్‌స్టేషన్ నిర్మాణం తదితర వాటికి చేసిన ఖర్చులపై అంచనాలు వేశారు. రెండు రోజుల్లో పూర్తి స్థాయి లెక్కింపు జరుగుతుందని రీజనల్ మేనేజర్ పి.వి.రామారావు తెలిపారు.