పుష్కరాలకు ఆర్టీసీ రిజర్వేషన్ నిల్
కృష్ణా పుష్కరాలకు ఆర్టీసీ రిజర్వేషన్ సౌకర్యాన్ని అధికారులు నిలిపివేశారు. పుష్కరాల నేపథ్యంలో ఆర్టీసీ ఎక్కడికక్కడ టెర్మినల్స్‌ను ఏర్పాటుచేసి నగరమంతా సిటీ బస్సుల హవా నడిపిస్తోంది. కాగా, షెడ్యూల్ ప్రకారం ఉన్న ఆర్టీసీ సర్వీసులకు రిజర్వేషన్ సౌకర్యం లేకుండా చేసింది.
విజయవాడ :
కృష్ణా పుష్కరాలకు ఆర్టీసీ రిజర్వేషన్ సౌకర్యాన్ని అధికారులు నిలిపివేశారు. పుష్కరాల నేపథ్యంలో ఆర్టీసీ ఎక్కడికక్కడ టెర్మినల్స్‌ను ఏర్పాటుచేసి నగరమంతా సిటీ బస్సుల హవా నడిపిస్తోంది. కాగా, షెడ్యూల్ ప్రకారం ఉన్న ఆర్టీసీ సర్వీసులకు రిజర్వేషన్ సౌకర్యం లేకుండా చేసింది. ఆగస్టు 11వ తేదీ అర్థరాత్రి ఆయా గమ్యస్థానాలకు చేరుకునేలా బస్సు రిజర్వేషన్ మాత్రమే ఏర్పాటుచేశారు. మరుసటి రోజు 12 గంటల సమయం నుంచి పుష్కరాలు ప్రారంభమవుతున్న తరుణంలో రిజర్వేషన్ నిలిపివేశారు.
ఎందుకంటే..
గత ఏడాది గోదావరి పుష్కరాల్లో ఆర్టీసీ బస్సులతో ప్రయాణికులు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. బస్సులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో రిజర్వేషన్ ప్రయాణికులు పడిగాపులు పడ్డారు. దీంతో బస్సులు సమయానుకూలంగా నడవక, ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోలేక.. రిజర్వేషన్ నగదును కోల్పోయారు. కొందరికి డబ్బు వాపస్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ సమస్య పునరావృత్తం కాకుండా ఉండేందుకు రిజర్వేషన్ సౌకర్యం ఎత్తివేసినట్లు అధికారులు చెబుతున్నారు.
కరెంట్ రిజర్వేషన్ ఉంది
ఆర్టీసీ షెడ్యూల్ ప్రకారం సర్వీసుల్ని రద్దు చేయట్లేదు. రిజర్వేషన్ రద్దు చేయడంతో షెడ్యూల్ ప్రకారం ఉన్న సర్వీసులకు కరెంట్ రిజర్వేషన్ అవకాశం కల్పించారు. అలాగే, స్పెషల్ సర్వీసులు నడపడానికీ ప్రయత్నాలు చేస్తున్నారు.