
బాలయ్య ఇలాఖాలో భూ దందా..
- రూ.20 కోట్ల విలువైన స్థలంపై అధికార పార్టీ నేతల కన్ను
- అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న వారికి బెదిరింపులు
- ఖాళీ చేసి వెళ్లకపోతే చంపుతామంటున్నారన్న వ్యాపారులు
హిందూపురం అర్బన్ : నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు భూ దందాకు తెరలేపారు. వివాదాస్పదమైన, రూ.20 కోట్లు విలువ చేసే భూమిపై వారి కన్ను పడింది. ఎలాగైనా దాన్ని కైవసం చేసుకునేందుకు అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న వారిని బెదిరిస్తున్నారు. మాట వినని వారిని చంపుతామంటూ భయపెడుతున్నారు. వివరాల్లోకెళితే.. పట్టణంలోని వీడీ రోడ్డులో మిషన్ కాంపౌండ్ (చిన్నరాజు కాంపౌండ్)గా పిలిచే సర్వే నంబరు 79-బీలో 1.36 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలం రూ.20 కోట్ల విలువ చేస్తుంది. ఇక్కడ పలువురు 50 ఏళ్లుగా బీరువాల తయారీ, మోటార్ మెకానిక్ పనులపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ స్థలం వివాదంలో ఉంది. హైకోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. అయినప్పటికీ దీనిపై కన్నేసిన కొందరు టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. స్థలంలో ఉంటున్న ఎనిమిది మందితో లోపాయికారిగా ఒప్పందం చేసుకుని, వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. మిగిలిన నలుగురు ససేమిరా అంటుండటంతో బలవంతంగా ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తున్నారు. జిల్లాపరిషత్ చైర్మన చమన్‌సాబ్, పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథిల పేర్లు చెప్పుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఖాళీ చేసి వెళ్లకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
రక్షణ కల్పించండి
చిన్నరాజు కాంపౌండ్ స్థలంలో బీరువాలు తయారు చేస్తూ 30మందికి ఉపాధి కల్పిస్తున్న తనను స్థలం ఖాళీ చేయకపోతే చంపుతామని కొందరు బెదరిస్తున్నారని జవహర్ సేఫ్‌కో కంపెనీ నిర్వాహకుడు అన్వర్‌సాబ్ ఆరోపించాడు. మంగళవారం హిందూపురం ప్రెస్‌క్లబ్‌లో ఎస్‌ఎల్‌వీటీ ట్రాన్స్‌పోర్టు అశ్వర్థనారాయణ, ఫయాజ్, ముస్తఫాతో కలిసి మాట్లాడాడు. ఆ స్థలం తమదేనని సిరాజ్, మునిసిపల్ చైర్‌పర్సన్ భర్త నాగరాజు, లాయర్ అజ్మతుల్లాలు అనుచరులతో వచ్చి షాపులు ఖాళీ చేసి వెళ్లకపోతే జేసీబీలతో కూల్చేస్తామని జెడ్పీ చైర్మన్ చమన్‌సాబ్, పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసార«థిల పేర్లు చెప్పి బెదిస్తున్నారని చెప్పారు. వారినుంచి ప్రాణçహాని, ఆస్తినష్టం కలిగే ప్రమాదం ఉందని, తమకు రక్షణ కల్పించాలని ఎస్పీతోపాటు టూటౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు.