
బాలయ్యా...మజాకా!
హిందుపురం : ఆలస్యంగా రావడమే కాకుండా, రెండు గంటలుగా తన కోసం పడిగాపులు కాస్తున్న మంత్రులను కాదని సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ....శంకుస్థాపనలకు వెళ్లిపోవటంతో బాలయ్యా...మజాకా...అనుకకోవటం అధికారులు, కార్యకర్తల వంతైంది. హిందుపురం పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం మంత్రులు కామినేని శ్రీనివాస్, పల్లె రఘునాథ్ రెడ్డితో పాటు హెల్త్ కమిషనర్ సౌరభ్ గౌర్, ఆర్డీవో, డీఆర్డీఏ పీడీ తదితరులు ఎమ్మెల్యే కోసం ఎదురు చూశారు.
షెడ్యూల్ కన్నా రెండు గంటలు ఆలస్యంగా వచ్చిన బాలయ్య ....మంత్రులను పట్టించుకోకుండానే కొట్నూరులో పాఠశాల భవనాల భూమిపూజ కార్యక్రమానికి వెళ్లిపోయారు. ఆయన రాక ఆలస్యంతో పలువురు ప్రజా ప్రతినిధులు ప్రధాన రహదారిలో మీడియా ప్రతినిధులతో కాలక్షేపం చేశారు. అనంతరం ప్రభుత్వాస్పత్రి సందర్శన సందర్భంగా సమస్యలపై కాకుండా ఎమ్మెల్యేను పొగడడానికే సమయం వెచ్చిందారు.
ఇక ఒకేరోజు 11 కార్యక్రమాలను రూపొందించటం, బాలయ్య రెండు గంటలు ఆలస్యంగా రావటంతో కార్యక్రమాలన్నీ తూతూ మంత్రంగా ముగిశాయి. మరోవైపు మితిమీరిన ఉత్సాహంతో పోలీసులు ప్రవర్తించటంతో సామాన్యులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లలేకపోయారు.