కనికరం లేని ప్రభుత్వం | Ruthless government | Sakshi
Sakshi News home page

కనికరం లేని ప్రభుత్వం

Published Tue, May 30 2017 11:10 PM | Last Updated on Tue, Oct 30 2018 5:12 PM

కనికరం లేని ప్రభుత్వం - Sakshi

కనికరం లేని ప్రభుత్వం

మూడేళ్లలో ఒక్క ఇల్లూ     నిర్మించలేదు
ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ధ్వజం
రైతుల కోసం ఎన్ని పాదయాత్రలైనా చేస్తాం : మాజీ ఎంపీ  అనంత
నార్పలకు చేరిన జొన్నలగడ్డ పద్మావతి పాదయాత్ర


అనంతపురం : ‘వరుస కరువులతో అల్లాడిపోతున్న జిల్లా రైతులు ఉపాధి కోసం కర్ణాటక, కేరళ, తెలంగాణ తదితర రాష్ట్రాలకు వలసలు వెళ్తుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదు. వారందరూ కార్లు, బైకుల కొనుగోలుకు, అధిక సంపాదన కోసం వెళ్తున్నారంటూ అవమానిస్తోంది. ఈ ప్రభుత్వానికి కాస్తయినా సిగ్గులేదు. కరువు ప్రాంతంపై కనికరం లేద’ని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ  సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి చేపట్టిన ‘మేలుకొలుపు’ పాదయాత్ర సోమవారం సాయంత్రం నార్పల మండల కేంద్రానికి చేరుకుంది. పట్టణ ప్రధాన కూడలిలో బహిరంగ సభ నిర్వహించారు. ప్రజలు భారీగా తరలివచ్చారు.

వారినుద్దేశించి ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. చంద్రబాబు పాలనపై ప్రజావ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో పద్మావతి పాదయాత్రకు లభిస్తున్న విశేష స్పందనే నిదర్శనమన్నారు. టీడీపీకి ఓట్లు వేసి తప్పు చేశామనే భావన ప్రజల్లో ఉందన్నారు. చంద్రబాబు ఈ మూడేళ్లలో ఒక్క ఇల్లయినా నిర్మించారా అని ప్రశ్నించారు. అ అంటే అమరావతి, ఆ అంటే ఆదాయం అని మనవడికి నేర్పిస్తున్నాడంటే సంపాదనపై బాబుకు ఎంత యావ ఉందో అర్థమవుతోందన్నారు. మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేలుకొల్పేందుకే పద్మావతి పాదయాత్ర చేస్తున్నారన్నారు. కరువు పేరు చెప్పి అధికార పార్టీ నేతలు రూ. కోట్లు దండుకుంటున్నారని విమర్శించారు.  దేశానికి అన్నం పెట్టే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఉపాధి కోసం వలసలు వెళ్తుంటే ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నిస్తే ఆయన కుటుంబంపై ఆరోపణలు చేస్తారా? బెదిరింపు ధోరణికి దిగుతారా? ఏం భయపడతామని అనుకుంటున్నారా? అలాంటి ప్రసక్తే లేద’ని అన్నారు. వైఎస్‌ పాలనలో రైతులు సుభిక్షంగా ఉండేవారని గుర్తు చేశారు.

చంద్రబాబు వచ్చిన తర్వాత వారి పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. కరువు పేరుతో వచ్చిన పనుల్లో జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారని విమర్శించారు. రైతులు, ప్రజల కోసం ఎన్ని పాదయాత్రలైనా చేపడతామని స్పష్టం చేశారు.  ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ మాటంటే ముఖ్యమంత్రి సింగపూర్‌ అంటున్నారని, శింగనమల నియోజకవర్గమంత లేని సింగపూర్‌ దేశంతో రాష్ట్రాన్ని ఎలా పోలుస్తారని ప్రశ్నిం చారు. చంద్రబాబు దోపిడీకి చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో అబద్ధపు హామీలతో చంద్రబాబు గద్దెనెక్కారన్నారు. బిడ్డనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన ఆయనకు.. ప్రజలను వెన్నుపోటు పొడవడం పెద్ద సమస్య  కాదన్నారు. కరువు, చంద్రబాబు కవల పిల్లలని, వారిని వేరు చేయలేరని చెబుతుంటారని... అయితే వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేయడం వల్ల వారిద్దరిని వేరు చేసి కరువును కూడా పారదోలవచ్చన్నారు. రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మంత్రులు, ఎంపీలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చీపుర్లు పట్టి మరీ దోస్తున్నారని ధ్వజమెత్తారు. మళ్లీ అవకాశం ఇవ్వరని తెలిసే అందినకాడికి దోచుకుంటున్నారన్నారు. జేసీ సోదరులు సభ్యత,సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తోపుదుర్తి కవిత మాట్లాడుతూ చంద్రబాబు వస్తే వర్షం వస్తుందో, రాదో తెలీదుకాని కరువు మాత్రం తప్పకుండా వస్తుందన్నారు. రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను నిలువునా ముంచారన్నారు.

జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ పాదయాత్రకు నియోజకవర్గ ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందన్నారు. దారి పొడవునా ప్రజలు సమస్యలపై ఏకరువు పెడుతున్నారన్నారు. దీన్నిబట్టి చూస్తుంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నారా...లేరా అనే సందేహం తలెత్తుతోందన్నారు. వైఎస్సార్‌సీపీ నార్పల మండల కన్వీనర్‌ రఘునాథరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డి, మార్కెట్‌యార్డ్‌ మాజీ చైర్మన్‌ నార్పల సత్యనారాయణరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ధనుంజయయాదవ్, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి కొర్రపాడు హుసేన్‌పీరా, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు పాల్గొన్నారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement