ఓటుకు నోటు వ్యవహారంలో సీఎం చంద్రబాబునాయుడు ఆడియో టేపుల ద్వారా అడ్డంగా దొరికిపోయి తెలుగు
♦ చంద్రబాబు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి
♦ ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
అనంతపురం క్రైం : ఓటుకు నోటు వ్యవహారంలో సీఎం చంద్రబాబునాయుడు ఆడియో టేపుల ద్వారా అడ్డంగా దొరికిపోయి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఉరవకొండ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఓటుకు నోటు అంశంపై బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తాము కూడా హైదరాబాద్‌లో పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేసి ఏపీ పోలీసులను అక్కడ పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడడం బాధాకరమన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో ముఖ్యమంత్రి పీకల్లోతు కూరుకుపోయారన్నారు.
ఈ కేసులో ఓ వైపు ఏసీబీ విచారణ చేస్తుంటే.. మరో వైపు చంద్రబాబు మదిలో అలజడి మొదలైందన్నారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీ అధికారులకు ఆడియో, వీడియో సాక్ష్యాలతో అడ్డంగా దొరికిపోవడంతో చంద్రబాబు బాగోతం వెలుగుచూసిందన్నారు. ఈ కేసు నుంచి చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. స్టీఫెన్‌తో చంద్రబాబు మాట్లాడినట్టు ఆడియో టేపుల ద్వారా బయటపడిన తరువాత ముఖ్యమంత్రికి హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు చేయాలనే విషయం గుర్తొంచ్చిందా అని ప్రశ్నించారు.
రాజకీయంలో సుదర్ఘీ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఇలాంటి చర్యలకు పాల్పడి తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కోసం నోట్ల కట్టలు ముట్టచెప్పిన నేరంలో సాక్ష్యాధారాలతో పట్టుబడిన చంద్రబాబు నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి నిజాయితీ పరుడైతే ఏసీబీ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక రాయితీల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నించి ఉంటే రాష్ర్ట ప్రజలు సంతోషించేవారన్నారు. ఓటుకు నోటు విషయంలో సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికిపోయిన ముఖ్యమంత్రి, ఆపార్టీ ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై గోబుల్స్ ప్రచారాలు చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. అసలు వైఎస్ జగన్‌కు ఈ వ్యవహారానికి సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
వేరుశనగ పంపిణీలో ప్రభుత్వం విఫలం
జిల్లాలో వేరుశనగ పంపిణీలో ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా రైతాంగానికి 5 లక్షల విత్తన వేరుశనగ కాయలు అవసరం ఉంటే ఈ ప్రభుత్వం 3.19 లక్షలు సేకరించి ఇప్పటి వరకు 2 లక్షల క్వింటాళ్లు మాత్రమే రైతులకు సరఫరా చేసి చేతులెత్తేసిందన్నారు. సరఫరా చేసిన వేరుశనగలో కూడా నాణ్యత లేవన్నారు. రైతాంగానికి అవసరమయ్యే వేరుశనగ కాయలు సరఫరా చేసేంత వరకు ఉద్యమించాలని రైతులకు పిలుపునిచ్చారు.