పది నుంచి రైతు రక్షణ జాతా ప్రారంభం
విజయవాడ(గాంధీనగర్) : అప్పులో ఊబిలో కూరుకుపోయిన రైతులను, వ్యవసాయ రంగాన్ని పరిరక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈనెల 10 నుంచి ‘రైతు రక్షణ జాతాలు’ నిర్వహించనున్నట్లు అఖిల భారత కిసాన్‌సభ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య తెలిపారు. హనుమాన్‌పేటలోని దాసరి భవన్‌లో రైతు రక్షణ జాతా వాల్‌పోస్టర్ సోమవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 10న శ్రీకాకుళం జిల్లా పలాస, కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి రక్షణ జాతాలు ప్రారంభించనున్నట్లు చెప్పారు. ముగింపు సందర్భంగా 20వ తేదీ విజయవాడలో భారీ ర్యాలీ, బహిరంగ నిర్వహించనున్నట్లు వివరించారు.ఽ వ్యవసాయరంగంపై పాలకుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో 15వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. 271 కరువు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడం లేదన్నారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర అ«ధ్యక్షుడు రామచంద్రయ్య, సంఘం గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్‌బాబు, కృష్ణాజిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.