ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటం
మాజీ హోంమంత్రి సబితారెడ్డి
శంషాబాద్ : స్థానిక సంస్థలను సీఎం కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారని మాజీ హోంమంత్రి సబితారెడ్డి విమర్శించారు. మండల పరిషత్ పాలకవర్గ సభ్యుల రెండేళ్ల పదవీకాలం పూర్తరుున సందర్భంగా శుక్రవారం వారిని అభినందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. గ్రామపంచాయతీల బలోపేతానికి ఒక్క పైసా కూడా విడుదల చేయడం లేదని, పైగా పంచాయతీల కరెంటు బిల్లుల్లో కోత పెడుతోందని విమర్శించారు. ఎర్రవెల్లి గ్రామానికి సర్పంచ్‌లా వ్యవహరిస్తున్న సీఎంకు గ్రామాల బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియదా అని ప్రశ్నించారు.
రెండేళ్లుగా అనేక సంక్షేమ పథకాలకు కోత పెట్టడం తప్ప ప్రజాసంక్షేమం కోసం చేసిందేమీ లేదన్నారు. బంగారుతల్లి, అమ్మహస్తం, ఆపద్బందు, అంత్యోదయ, ఇందిరమ్మ ఇళ్లు ఏవీ లేకుండా చేశారని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలపై ప్రచార ఆర్భాటం తప్ప ప్రజలకు చేరవేసేందుకు ఇంతవరకు చేసిందేమీ లేదన్నారు. ప్రభుత్వంపై ఇంతకాలం ప్రజలు పెట్టుకున్న నమ్మకం భ్రమేనని తేలిపోతోందన్నారు. ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వంపై పోరాడుతూ ప్రజల గొంతుకగా పనిచేస్తామన్నారు. సమావేశంలో ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, జెడ్పీటీసీ సభ్యుడు సతీష్ తదితరులు పాల్గొన్నారు.