కేజ్రీవాల్‌లా చేయకండి.. | KCR should not act like Kejriwal, says Sadananda Gowda | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌లా చేయకండి..

Published Wed, Jun 29 2016 3:56 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

కేజ్రీవాల్‌లా చేయకండి.. - Sakshi

కేజ్రీవాల్‌లా చేయకండి..

సీఎం కేసీఆర్‌పై కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ: హైకోర్టు విభజన విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాటిమాటికి కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ విమర్శించారు. ‘‘ఢిల్లీ వస్తా.. ధర్నా చేస్తా.. అంటే మాకేం అభ్యంతరం లేదు. కేసీఆర్.. కేజ్రీవాల్‌లా చేయకూడదు. కేజ్రీవాల్ ఏం చేయరు.. కానీ రోజూ కేంద్రంపై విమర్శలు గుప్పిస్తారు’’ అని వ్యాఖ్యానించారు.

మంగళవారం కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ నేతృత్వంలో బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, పలువురు పార్టీ లీగల్ సెల్ నేతలు హైకోర్టు విభజన, న్యాయాధికారుల అంశాలను సదానంద దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశం అనంతరం న్యాయమంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ బీజేపీ లీగల్ సెల్, సీనియర్ మంత్రి బండారు దత్తాత్రేయ నా వద్దకు వచ్చారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను వివరించారు.

హైకోర్టు విభజనకు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. మౌలిక వసతుల కల్పించాల్సిన బాధ్యత ఏపీ ముఖ్యమంత్రిది. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ న్యాయమూర్తుల విభజన చేయాల్సి ఉంటుంది. తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత న్యాయశాఖ అవసరమైన చర్యలు చేపడుతుంది. హైకోర్టు విభజనలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏమీ లేదు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది.

పదేళ్ల సమయంలో రాజధాని ఏర్పాటయ్యేంతవరకు.. ముఖ్యంగా మౌలిక వసతుల ఏర్పాటు అయ్యేంతవరకు అక్కడే కొనసాగడం అనేది ఏపీ ప్రభుత్వం వద్ద ఉన్న ఆప్షన్. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు అనేది ముఖ్యమంత్రి, హైకోర్టు చీఫ్ జస్టిస్ బాధ్యత. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఇందులో కేంద్రం పాత్ర ఎంతమాత్రం లేదు. సబార్డినేట్ కోర్టులు కూడా మా పరిధిలో ఉండవు’’ అని ఆయన అన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్, సీఎం సంప్రదింపులు జరిపి న్యాయమూర్తుల నియామకం చేపడతారని చెప్పారు.
 
రాజ్యాంగ నిబంధనలు చూసుకోవచ్చు..
ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య విషయంలో ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణకు చెందిన వారు చాలా తక్కువగా ఉన్నారని, దీనిపై నిన్ననే సమాచారం వచ్చిందని సదానంద గౌడ చెప్పారు. ‘‘న్యాయమూర్తుల విభజన జరిగింది. ఏపీ హైకోర్టుకు 37 మంది న్యాయమూర్తులు ఉండాలి. తెలంగాణ హైకోర్టుకు 24 మంది న్యాయమూర్తులు ఉండాలి. ప్రస్తుతం ఉన్నవారిలో ఏపీకి చెందిన వారు 18, తెలంగాణకు చెందిన వారు ముగ్గురు ఉన్నారు.

అందులో నేనేమీ విభేదించడం లేదు. అయితే సబార్డినేట్ జ్యుడీషియరీలో న్యాయాధికారులు ఏ రాష్ట్రానికి చెందిన వారైతే ఆ రాష్ట్రంలో ఉంటారు. దానిని చీఫ్ జస్టిస్ చూస్తారు. అది చట్ట ప్రకారం జరుగుతుంది. ఆశ్చర్యమేంటంటే తెలంగాణ సీఎం మాటిమాటికి కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారు. కేంద్రం ఏ చర్య తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. వారికి కూడా న్యాయశాఖ ఉంది. వాళ్లు రాజ్యాంగ నిబంధనలు చూసుకోవచ్చు. పునర్ వ్యవస్థీకరణ చట్టం చదువుకోవచ్చు. అంతేగానీ సింపుల్‌గా కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేయడాన్ని ఈ దేశ ప్రజలు ఆశించడం లేదు’’ అని దుయ్యబట్టారు.

కేసీఆర్ ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ‘‘నాలుగైదు సార్లు తెలంగాణ ఎంపీలు వచ్చి నన్ను కలిశారు. ఇద్దరు సీఎంలతో చర్చించాను. హైకోర్టు విభజన విషయంలో చొరవ చూపాను. ఇంతలో హైకోర్టులో పిల్ దాఖలైంది. తర్వాత తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంతో ఇప్పుడది కోర్టు పరిధిలో ఉంది. అందువల్ల హైకోర్టు విభజనపై నేను మాట్లాడటం తగదు. ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సబ్‌జ్యుడిస్ అవుతుంది’’ అని పేర్కొన్నారు.
 
ప్రజలే జవాబిస్తారు...
హైకోర్టు విషయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు, గవర్నర్‌కు లేఖ రాస్తాన ని సదానంద గౌడ తెలిపారు. ‘‘కానీ సింపుల్‌గా నేను ఢిల్లీ వస్తా.. ధర్నా చేస్తానంటే ఎలా..? స్వాగతిస్తాం. మాకేం అభ్యంతరం లేదు. ఆయన కేజ్రీవాల్‌లా చేయకూడదు. కేజ్రీవాల్ ఏం చేయరు కానీ రోజూ కేంద్రంపై విమర్శలు గుప్పిస్తారు. కేసీఆర్ కూడా కేజ్రీవాల్‌లా వ్యవహరిస్తానంటే ప్రజలే జవాబిస్తారు’’ అని అన్నారు.

బీజేపీ ప్రతినిధి బృందం చెప్పిన వ్యవహారాలన్నింటిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు, గవర్నర్‌కు లేఖ రాస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌలిక వసతులు ఏర్పాటు చేయడం లేదు కదా అని మీడియా ప్రశ్నించగా... ‘‘ఎవరు ఒత్తిడి చేస్తారు? నేను చేయగలనా? రేపు వాళ్లేమంటారు? రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని అంటారు. మీరు సమాఖ్య వ్యవస్థ అంటూ ఇలా ఎందుకు చేస్తున్నారని అడగరా?’’ అని ఎదురు ప్రశ్నించారు.

వారు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయన్న ప్రశ్నకు బదులుగా ‘‘నాకు తెలియదు. దానిపై నేనేమీ మాట్లాడను. అందులో మేమేమీ చేసేది లేదు. నేను హైదరాబాద్ వచ్చా. సీఎంలతో మాట్లాడా. హైకోర్టులో కేసు వచ్చాక ఇక నేను చేసేదేమీ లేదు’’ అని పేర్కొన్నారు. ‘‘విషయం కోర్టులో పెండింగ్‌లో ఉండగా నేను ముఖ్యమంత్రికి లేఖ రాయలేను. సబ్‌జ్యుడిస్ అంటే ఏంటో మీకు తెలుసు. న్యాయశాఖ మంత్రిగా నా పరిధి నాకు తెలుసు. రేపు ఏదైనా జరిగితే మీరు తప్పుపడతారు. అది కోర్టు పరిధిలో ఉందని తెలంగాణకు కూడా తెలుసు’’ అని వ్యాఖ్యానించారు.
 
సామరస్యంగా పరిష్కరిస్తామన్నారు: దత్తాత్రేయ
కేంద్ర న్యాయమంత్రి సదానంద గౌడతోపాటు, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో తాము సమావేశమయ్యామని, హైకోర్టు విభజన అంశంపై సామరస్యంగా పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం తన కార్యాలయంలో బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ సెక్రటరీ బాలసుబ్రమణ్యం, లీగల్ సెల్ కన్వీనర్ విశ్వనాథ్, రామారావు, ఆంటోనీ రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. హైకోర్టు విభజన వ్యవహారం ఇద్దరు సీఎంలు కలిసి కూర్చొని పరిష్కరించుకునే అంశమే గానీ.. ఢిల్లీ వచ్చి ధర్నా చేస్తామనడం సమంజసం కాదని పేర్కొన్నారు. ‘‘మీరు ఢిల్లీ వచ్చి చేయాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వ పాత్ర ఇందులో ఏమాత్రం లేదు. మీ కార్యాలయంలో కూర్చొని పరిష్కారం చేసుకోవచ్చు. రోడ్లపైకి రావాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement