సమగ్ర రచనలు వెలుగులోకి తేవాలి
సమగ్ర రచనలు వెలుగులోకి తేవాలి
Published Wed, Nov 9 2016 10:42 PM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM
సాహితీ శరత్ కౌముది ఉత్సవాల ముగింపు సభలో రేకపల్లి
రాజమహేంద్రవరం కల్చరల్ : శిలావిగ్రహాలు పెట్టడం కాదు, కళాప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మినరసింహం సమగ్ర రచనలు వెలుగులోకి తేవాలని అమలాపురానికి చెందిన న్యాయవాది, సాహితీవేత్త, సంగీత విద్వాంసుడు రేకపల్లి శ్రీనివాసమూర్తి పిలుపునిచ్చారు. ఆంధ్రకేసరి డిగ్రీకళాశాలలో బుధవారం జరిగిన సాహితీ శరత్ కౌముది ముగింపు సభలో రేకపల్లి శ్రీనివాసమూర్తి ‘చిలకమర్తి జీవితం–సాహిత్యం’ అనే అంశంపై ప్రసంగించారు. యుగపురుషుడు వీరేశలింగానికి శిష్యపరమాణువునని చిలకమర్తి స్వీయరచనలో చెప్పుకున్నారన్నారు. అయితే, స్వాతంత్య్ర ఉద్యమ బాటలో కందుకూరి నడిచినట్టు కనపడదు.. కానీ చిలకమర్తి నాడు స్వాతంత్య్రపోరాటానికి సమాంతరంగా నడిచిన అన్ని ఉద్యమాల్లోనూ పాల్గొన్నారన్నారు. దేశభక్తి ప్రపూరితమైన రచనలు ఎన్నిటినో చేశారని తెలిపారు. జాతీయ నాయకుడు బిపిన్ చంద్రపాల్ స్వాతంత్య్ర ఉద్యమకాలంలో రాజమహేంద్రవరంలోని నేటి ఫ్రీడం పార్కులో 5 రోజులు ప్రసంగించారని, వాటిని చిలకమర్తి తెలుగు అనువాదం చేసి, ప్రజలకు అందించేవారన్నారు. ప్రసంగాల చివరిరోజున ’భరతఖండంబు చక్కని పాడియావు’ పద్యాన్ని ఆశువుగా చెప్పారని వివరించారు. కథలు, నాటకాలు, ప్రహసనాలు, జీవితచరిత్రలు..ఇలా ఎన్నో ప్రక్రియల్లో శతాధికంగా చిలకమర్తి రచనలు చేశారన్నారు. తన 40వ ఏట చూపు కోల్పోయినా, మనో నేత్రంతో ప్రపంచాన్ని సందర్శించి రచనలు చేశారన్నారు. మహాత్మునికన్నా ముందే 1907లో నగరంలో రామ్మోహనరావు దళిత పాఠశాలను ప్రారంభించారని పేర్కొన్నారు. అత్యం త సులభభాషలో చిలకమర్తి రచించిన పద్యాలు అందరికీ అర్ధమవుతాయన్నారు. ’కావు’ (కాపాడు), ’కావు’(కాపాడు) అంటూ కాకి దేవుని ప్రార్థిస్తూ నిద్ర లేస్తుందని, ఈ గుణం మనిషికి పట్టుపడలేదని ఆయన ఒక పద్యంలో చమత్కరించారని రేకపల్లి తెలిపారు.
స్త్రీవిద్యను ప్రోత్సహించారని, ’ముదితల్ నేర్వగరాని విద్య గలదె ముద్దార నేర్పించినన్ ’ అని తన పద్యాల్లో తెలిపారన్నారు. సంస్కృతంలో భాసుడు రచించిన 13 నాటకాలను చిలక మర్తి తెలుగులోకి అనువదించారన్నారు. సభకు అధ్యక్షత వహించిన చిలకమర్తి ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి పెరుమాళ్ళ రఘునాథ్ మాట్లాడుతూ శతాధిక రచనలు చేసిన చిలకమర్తి సొంత ఇంటిని కూడా సమకూర్చుకోలేకపోయారన్నారు. ఫౌండేషన్ తరఫున విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచనపోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. ఆంధ్రకేసరి యువజన సమితి అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, కళాశాల కోశాధికారి ఫణి నాగేశ్వరరావు ప్రసంగించారు. ముఖ్య వక్త రేకపల్లి శ్రీనివాసమూర్తిని నిర్వాహకులు సత్కరించారు. కళాశాల ప్రిన్సిపాల్ చింతా జోగినాయుడు, సంస్కృత ఉపన్యాసకురాలు కామేశ్వరి పాల్గొన్నారు.
Advertisement