
నగరంలో సైఫ్‌కరీనా జంట సందడి
జూబ్లీహిల్స్/కాచిగూడ: రోగులకు వైద్య సేవలందిస్తూ వేలాదిమందికి ప్రాణదానం చేసే ఆసుపత్రికి బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయడం సంతోషకరమని ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్‌ఆలీఖాన్, ఆయన సతీమణి, హీరోయిన్ కరీనాకపూర్ పేర్కొన్నారు. శనివారం బంజారాహిల్స్ పార్క్ హయత్ హోట ల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. తాము ఇప్పటికే కాచిగూడలోని ప్రతిమ ఆసుపత్రిని సందర్శించి తక్కువ ఖర్చుతో అందిస్తున్న అత్యుత్తమ సేవలు స్వయంగా చూసినట్లు తెలిపారు.
ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ హరిణి బోయనపల్లి మాట్లాడుతూ కరీంనగర్, కాచిగూడ, కూకట్‌పల్లిలలో తాము ఇప్పటికే 1500 పడకల సామర్థ్యంతో ఆసుపత్రులు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 200 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టామని, మరో 350 కోట్ల పెట్టుబడి పెట్టి అత్యాధునిక వైద్యసదుపాయాలతో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రతి జిల్లాలో 50 నుండి 100 పడకల సామర్థ్యంతో కొత్త ఆసుపత్రులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
స్థానికంగా పనిచేసే వైద్యులను భాగస్వామ్యులుగా చేసుకొని వారికి వాటా ఇవ్వడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. వరంగల్ పట్ణణంలో 5 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 100 కోట్ల పెట్టుబడితో కేన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి చైర్మన్ బోయనపల్లి శ్రీనివాసరావు, డైరెక్టర్ హాసిని, డాక్టర్ ప్రభాకర్‌రావు, ఎంపీ బోయనపల్లి వినోద్‌కుమార్ పాల్గొన్నారు.
సైఫ్, కరీనాలకు వైద్యపరీక్షలు
ప్రతిమ ఆస్పత్రిని సందర్శించిన సైఫ్ ఆలీఖాన్, కరీనాకపూర్‌లకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆస్పత్రికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న వీరు ఆస్పత్రిలో దాదాపు గంటన్నరపాటు గడిపారు. సైఫ్ దంపతుల రాకతో అభిమానులు పెద్దసంఖ్యలో వచ్చారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది.