‘సాక్షి’ కథనాలు.. అక్షర సత్యాలు
అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఏఈఎల్‌సీ ఆస్తులను లీజుల పేరుతో తీసుకుని అమ్ముకుంటున్నారని ఏఈఎల్‌సీ ఆస్తుల పరిరక్షణ కమిటీ చైర్మన్ పిల్లి విద్యాసాగర్ చెప్పారు.
బహిరంగ చర్చకు ఎమ్మెల్యే సిద్ధమా?
ఏఈఎల్‌సీ ఆస్తుల పరిరక్షణ కమిటీ నేతల సవాల్
గుంటూరు (రైలుపేట) : అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఏఈఎల్‌సీ ఆస్తులను లీజుల పేరుతో తీసుకుని అమ్ముకుంటున్నారని ఏఈఎల్‌సీ ఆస్తుల పరిరక్షణ కమిటీ చైర్మన్ పిల్లి విద్యాసాగర్ చెప్పారు. సంస్థ ఆస్తులపై ఇటీవల ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనాలన్నీ అక్షర సత్యాలని, వాటిని నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీనిపై ప్రజాప్రతినిధులు బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. శుక్రవారం లాడ్జి సెంటర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏఈఎల్‌సీ ఆస్తుల విక్రయాలపై ప్రజాప్రతినిధులపై హైకోర్టులో రిట్ వేస్తామన్నారు. ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా, ఎంపీ రాయపాటి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, రాయపాటి రంగారావు,పొన్నెకంటి మంజుల పేర్లతో ఏఈఎల్‌సీ ఆస్తులు లీజుకు తీసుకున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఏఈఎల్‌సీ కౌన్సిల్ సమావేశంలో నక్కా ఆనందబాబుకు, ఆలపాటి రాజాకు స్థలాలు కేటాయించినట్లు తీర్మాన కాపీలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. ఎందరికో విద్య, వైద్యం అందిస్తూ ఆధ్యాత్మిక భావనతో ప్రజలను సన్మార్గంలో నడుపుతున్న ఏఈఎల్‌సీ సంస్థ ఆస్తులను పరిరక్షించాలిన ప్రజాప్రతినిధులు లీజుల పేరుతో అమ్ముకోవటం దారుణమన్నారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో లూథరన్ లైట్ మూవ్‌మెంట్ అధ్యక్షుడు జి.దయావర్థనరావు, జి.ఆర్.భగత్‌సింగ్ పాల్గొన్నారు.