సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై వెల్లువెత్తిన నిరసన
సర్కారు నిరంకుశ వైఖరిని ముక్తకంఠంతో ఖండించిన జర్నలిస్టు సంఘాలు
సంఘీభావం తెలిపిన పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు
జిల్లా అంతటా ర్యాలీలు, ధర్నాలు, మానవహారాలు
అక్షరం ఆగ్రహించింది.. కలం గళమెత్తింది.. కెమెరా కన్నెర్ర చేసింది.. అన్నీ కలిసి.. భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్న సర్కారు దాష్టీకంపై దండెత్తాయి. వందలు.. వేల గొంతుకలొక్కటై సర్కారు నిరంకుశత్వాన్ని నిరసించాయి. తమకు వ్యతిరేకంగా జరుగుతున్న ఒక సామాజిక ఉద్యమాన్ని ప్రసారం చేస్తున్నారన్న సాకుతో సాక్షి టీవీ ప్రసారాలను ఏకపక్షంగా నిలిపివేయించడాన్ని తీవ్రంగా తప్పుపట్టాయి.
తమకు అనుకూలంగా లేని మీడియాపై కత్తిగట్టడం ఎమర్జెన్సీ చీకటి రోజులను గుర్తుకు తెస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా విశాఖ నగరంతోపాటు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ జర్నలిస్టు సంఘాలు ఒక్కటై.. ర్యాలీలు, ధర్నాలు, మానవహారాలతో కదం తొక్కాయి.