మీడియాకు సంకెళ్లా! | Sakshi TV broadcasts suspension | Sakshi
Sakshi News home page

మీడియాకు సంకెళ్లా!

Published Sun, Jun 12 2016 1:34 AM | Last Updated on Mon, Aug 20 2018 8:43 PM

Sakshi TV broadcasts suspension

సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై వివిధ వర్గాల నిరసన
మదనపల్లి, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో వెల్లువెత్తిన ఆందోళనలు
నేడు తిరుపతి ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
ఉద్యమ పథానికి సిద్ధమవుతున్న ప్రతిపక్ష, వామపక్ష పార్టీలు

 

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై జర్నలిస్టు సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వం భావప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు వేయాలనుకోవడం ఎంతమాత్రం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తంచేశాయి. ప్రజాసమస్యలను  ఎత్తిచూపే మీడియా గొంతు నొక్కేందుకు సర్కారు ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని, లేనిపక్షంలో ప్రభుత్వ దమనకాండను ఖండిస్తూ జిల్లా అంతటా పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రతిపక్ష, వామపక్ష పార్టీలు హెచ్చరించాయి.



తిరుపతి : రెండు రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం సాక్షి టీవీ ప్రసారాలపై ఉక్కుపాదం మోపింది. ప్రజాపక్షంగా నిలిచి ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపడాన్ని తట్టుకోలేక ప్రసారాలను నియంత్రించేందుకు పూనుకుంది. పలు జిల్లాల్లో ప్రసారాలను నిలిపివేయించింది. చిత్తూరు జిల్లాలోనూ కొన్ని నియోజకవర్గాల్లో శుక్రవారం నుంచి  ప్రసారాలు నిలిచిపోయాయి. దీంతో జర్నలిస్టు సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, పార్టీ సానుభూతిపరులు ప్రభుత్వంపై భగ్గుమన్నారు. ప్రత్యేక నిరసనలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా శనివారం మదనపల్లి, కుప్పం నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. మదనపల్లె ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో సబ్‌కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన నిర్వహించిన జర్నలిస్టులు మూకుమ్మడిగా వెళ్లి మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. బెరైడ్డిపల్లిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొగసాల కృష్ణమూర్తి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రెడ్డెప్పలతోపాటు పలువురు పార్టీ సానుభూతిపరులు నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం లోపలి గోడకు వినతిపత్రాన్ని అతికించారు. కుప్పంలో పార్టీ మండల కన్వీనర్ వెంకటేశ్ బాబు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, అఖిలపక్ష నేతలు ప్రధాన రోడ్డుపై నిరసన ర్యాలీ నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

 
అదేవిధంగా రామకుప్పం, శాంతిపురం, గుడుపల్లి మండలాల్లోనూ వైఎస్‌ఆర్‌సీపీ, అఖిలపక్ష నాయకులు శనివారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పత్రికా స్వేఛ్చకు భంగం కలిగించవద్దని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు.

 
నేడు తిరుపతి, చిత్తూరుల్లో...
సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతను నిరసిస్తూ ఆదివారం ఉదయం తిరుపతి ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నగరంలో నిరసన  ర్యాలీ నిర్వహించనున్నారు. పలు జర్నలిస్టు సంఘాలు ఇందుకు మద్దతుపలికాయి. ప్రభుత్వ వైఖరిని ఖండించాయి. చిత్తూరులో వైఎస్సార్‌సీపీ నాయకులు పెద్దఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించేందుకు పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచర్ల మండలాల్లోనూ, పలమనేరు, పీలేరు, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లోనూ జర్నలిస్టు సంఘాలు నిరసనలకు సిద్ధమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement