
అయ్యో నాన్న!
స్థానికులు సమాచారం అందిస్తే ‘అయితే నేనేం చేయాలి’ అన్న కొడుకు
కేజీహెచ్‌కు తరలించిన స్థానికులు
చిన్నప్పుడు అమ్మ గోరుముద్దలు తినిపిస్తే.. నాన్న చేయి పట్టుకుని ఈ లోకాన్ని చూపిస్తూ నడక నేర్పుతాడు. అల్లారు ముద్దుగా పెంచి.. కావాల్సిందల్లా కొనిపెట్టి.. ఏది మంచో.. ఏది చెడో చెబుతూ నడత నేర్పుతాడు. అలాంటి తండ్రి.. వయసుడిగి.. కదల్లేని స్థితికి చేరాక.. ఆతని రక్తం పంచుకుపుట్టిన కొడుకే నడిరోడ్డుపైకి ఈడ్చేశాడు. నడవలేని స్థితిలో కాలువలో పడిపోయిన ఆ తండ్రిని.. స్థానికులు బయటికి తీసి.. సపర్యలు చేసి.. పోలీసుల సహకారంతో కేజీహెచ్‌కు తరలించారు.
అల్లిపురం: వయసు మీద పడడంతో నడవలేని స్థితిలో ఉన్న సబ్బవరానికి చెందిన సకురు సీతారామయ్య (75)ను అల్లిపురం, రైల్వేక్వార్టర్స్, రైల్వే కోర్డు మేజిస్ట్రేట్ బంగళా వద్ద సోమవారం సాయంత్రం ఆతని కుటుంబ సభ్యులు వదిలేసి వెళ్లిపోయినట్లు స్థానికులు గుర్తించారు. అప్పటి నుంచీ అక్కడే పడి ఉన్న అతడు మంగళవారం ఉదయం పక్కనే ఉన్న కాలువలో పడిపోయి ఉండడాన్ని చూసి, బయటికి తీసి పక్కన పడుకోబెట్టారు.
దారిన పోయేవారంతా.. అతడిని చూసి.. అయ్యో అంటూ నిట్టూర్చారు. కొందరు రొట్టెలు, మంచినీళ్లు తెచ్చి అందించారు. మండుటెండలోనే పడి ఉన్న వృద్ధుడిని ఒక మీడియా వ్యాను డ్రైవర్ విశ్వేశ్వరరావు, స్థానిక మోటార్ మెకానిక్ ఎం.డి. ఆలీ సపర్యలు చేసి టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. కాస్త తేరుకున్న వృద్ధుడిని ఆరా తీసి, అతని కొడుకు వివరాలు తెలుసుకున్నారు.
సీతారామయ్యకు సబ్బవరం పోలీస్ స్టేషన్ ఎదురుగా నాలుగు పోర్షన్ల ఇల్లు ఉందని, కొడుకు పేరు సకురు వెంకటరమణ అని, కోడలి పేరు రాధ అని, కాంట్రాక్ట్ పనులు చేస్తుంటారని చెప్పటంతో తెలిసిన వారు సబ్బవరంలో ఉన్న స్నేహితులకు ఫోన్ చేసి వివరాలు అందించే ప్రయత్నం చేశారు. వారు అతని ఇంటి అడ్రస్ తెలుసుకుని కొడుకు ఫోన్ నంబరు సంపాదించి, వెంకటరమణకు ఫోన్ చేసి తండ్రి పరిస్థితిని వివరించారు. ‘అయితే.. నేనేం చేయాలి’ అని, తాను వీరఘట్టంలో ఉన్నానని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటంతో అవాక్కయ్యారు. ఇంతలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని 108కు సమాచారం ఇవ్వటంతో వారు సీతారామయ్యను కేజీహెచ్‌లో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.