సమయమిదే.. స్పందించాలి మరి!
అనంతపురం అగ్రికల్చర్ :
ఖరీఫ్‌ను అత్యంత దారుణంగా కాటేసిన కరువు రక్కసి రబీ సీజన్‌నూ వెంటాడుతోంది. జులై తర్వాత ఒక్కరోజు కూడా సరైన వర్షం కురవకపోవడంతో ‘అనంత’ అతలాకుతలమైంది. పంట తొలగింపు ఖర్చులు కూడా దక్కే పరిస్థితి కనిపించకపోవడంతో కొన్ని చోట్ల వేరుశనగను పశువులు, గొర్రెలకు వదిలేశారు. సాగుకే కాదు.. తాగునీటికీ కటకట మొదలైంది. చలికాలంలోనే తాగునీరు లభించడం కష్టంగా మారింది. అననుకూల వర్షాలు, సుదీర్ఘ వర్షపాత విరామాల (డ్రైస్పెల్స్) కారణంగా ఈ ఖరీఫ్‌లో 6.09 లక్షల హెక్టార్లలో వేరుశనగ దెబ్బతినింది. 1.50 లక్షల హెక్టార్లలో ఇతర పంటలు కూడా 90 శాతం వరకు దెబ్బతిన్నాయి. ఇప్పటికీ వర్షాలు లేకపోవడంతో 1.50 లక్షల హెక్టార్లలో సాగులోకి రావాల్సిన రబీ పంటల విత్తనమే ఆగిపోయింది. ఇంతటి దుర్భర పరిస్థితులు నెలకొన్న ప్రస్తుతం తరుణంలో కరువు పరిశీలనార్థం కేంద్ర బృందాలను జిల్లాకు తీసుకురాగలిగితే దుర్భిక్ష పరిస్థితుల తీవ్రత వారికి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఖరీఫ్, రబీ రెండు సీజన్లకూ సంబంధించి అన్ని పంటల పరిస్థితి, రైతుల స్థితిగతులు వారిని చలింపజేస్తాయనడంలో సందేహం లేదు. తద్వారా జిల్లాకు మేలు కలిగే అవకాశాలూ ఉంటాయి. అలాకాకుండా పంటలన్నీ తొలగించిన తర్వాత, ఎక్కడా పంటలు లేని సమయంలో కరువు బృందాలు పర్యటిస్తే ఒనగూరే ప్రయోజనాలేవీ ఉండవని రైతుసంఘాల నాయకులు చెబుతున్నారు.
కరువు నివేదికలు బుట్టదాఖలు
జిల్లాకు వచ్చి వెళుతున్న కేంద్ర బృందాలు చేసిన సిఫారసులు కూడా అమలు కావడం లేదు. వారికి ఇచ్చిన కరువు నివేదికలు బుట్టదాఖలవుతూనే ఉన్నాయి.
- భారత వ్యవసాయ పరిశోధన కేంద్రం (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్ సారథ్యంలోని 18 మంది నిపుణులతో కూడిన ‘హైపవర్ టెక్నికల్ కమిటీ’ 2012 జనవరి, ఫిబ్రవరి మాసాల్లో రెండు దఫాలుగా జిల్లాలో పర్యటించింది. ఆ కమిటీ చేసిన సిఫారసుల అమలు కోసం రూ.7,676 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన ‘ప్రాజెక్టు అనంత’ కూడా అనతికాలంలోనే కాలగర్భంలో కలిసిపోయింది.
- 2013 ఏప్రిల్ 18న భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) రాష్ట్ర జనరల్ మేనేజర్ కళ్యాణ చక్రవర్తి నేతృత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారుల బృందం జిల్లాలో పర్యటించింది. తక్షణసాయంగా రూ.1,065 కోట్లు కావాలని జిల్లా అధికారులు కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. 2013 డిసెంబర్‌లో కేంద్రానికి చెందిన కమిషన్ ఫర్ సెంట్రల్ క్రాప్స్ అండ్ ప్రైసెస్ కమిషనర్ అశోక్‌గులాటే బృందం పర్యటించింది.
- 2014 ఏప్రిల్ 22, 23 తేదీల్లో ‘ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం’ పేరుతో మరోసారి కేంద్ర బృందం జిల్లాకు వచ్చింది. తక్షణం రూ.1,147.50 కోట్లు అవసరమని జిల్లా అధికారులు నివేదిక అందజేశారు.
- 2015 ఏప్రిల్ 1న కేంద్ర వ్యవసాయశాఖ జాయింట్ సెక్రటరీ షకీల్‌అహ్మద్ నేతృత్వంలో మరో బృందం పర్యటించగా జిల్లా తరపున రూ.1,404 కోట్లు తక్షణసాయం కావాలని కోరారు. కానీ ఏ ఒక్కసారీ రూపాయి కూడా మంజూరు చేయలేదు. కేంద్ర కరువు, విపత్తు నివారణ కమిషనర్ రాఘవేంద్ర సింగ్, కేంద్ర హార్టికల్చర్ డైరెక్టర్ అతుల్‌పాట్నేలతో కూడిన మరో బృందం కూడా కరువును పరిశీలించి వెళ్లింది. ఫలితం మాత్రం శూన్యం.