సారా మానకుంటే రేషన్, ఆధార్ కార్డుల రద్దు
సప్పిపుట్టు గ్రామసభలో సబ్‌కలెక్టర్ శివశంకర్
పాడేరు రూరల్: సారా తయారీ, అమ్మకాలు, తాగడం ఆపేయాలి..లేకుంటే కఠినమైన చర్యలు ఉంటాయి.. రేషన్, ఆధార్ కార్డులు రద్దు చేస్తాం.. ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తాం అని సబ్ కలెక్టర్ లోతేటి శివశంకర్ అన్నారు. పాడేరు రూరల్ మండలంలోని వంతాడపల్లి పంచాయతీలో సారా ప్రభావిత గ్రామమైన సప్పిపుట్టులో శుక్రవారం సారా నిర్మూలనపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసి మాట్లాడారు. సారాను ప్రభుత్వం పూర్తిగా నిషేధించిందన్నారు. సారాకు దూరంగా ఉంటే ప్రత్యామ్నయంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని.. గ్రామంలో గిరిజనులు సాగు చేస్తున్న 50 ఎకరాల పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పారు. జలసిరి పథకం కింద ప్రత్యేకంగా బోర్లు ఏర్పాటు చేసి భూములను వ్యవసాయానికి అనుకూలంగా మారుస్తామన్నారు.
తర్వాత గ్రామస్తులు తమ సమస్యలను సబ్ కలెక్టర్‌కు విన్నవించారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తానని శివశంకర్ చెప్పారు. గ్రామంలోని పాఠశాల ఉపాధ్యాయురాలు సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని స్థానికులు సబ్ కలెక్టర్ చెప్పారు. అనంతరం గ్రామస్తులతో సారా తయారీకి దూరంగా ఉంటామని.. సారా తాగం అని ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, సీఐ శ్రీనివాసరావు, తహశీల్దార్ ఆది మహేశ్వరరావు, సర్పంచ్ మర్రి వెంకటరావు, వీఆర్వో కనకరత్నం, సెక్రటరీ సురేష్, టీడీపీ త్రిసభ్య కమిటీ సభ్యులు బొర్రా నాగరాజు పాల్గొన్నారు.