
వైభవంగా శతచండీ సహిత రుద్రయాగం
దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో తొలిసారిగా శత చండీ సహిత రుద్రయాగాన్ని బుధవారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఇంద్రకీలాద్రి దిగువన మల్లికార్జున మహామండపంలో నిర్మించిన ప్రత్యేక యాగశాలలో ఆలయ కార్య నిర్వహణాధికారి ఎ.సూర్యకుమారి దంపతులు ప్రారంభించగా, దేవాదాయశాఖ కమిషనర్ అనూరాధ అగ్నిప్రతిష్టాపన చేశారు.
సాక్షి, విజయవాడ : దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో తొలిసారిగా శత చండీ సహిత రుద్రయాగాన్ని బుధవారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఇంద్రకీలాద్రి దిగువన మల్లికార్జున మహామండపంలో నిర్మించిన ప్రత్యేక యాగశాలలో ఆలయ కార్య నిర్వహణాధికారి ఎ.సూర్యకుమారి దంపతులు ప్రారంభించగా, దేవాదాయశాఖ కమిషనర్ అనూరాధ అగ్నిప్రతిష్టాపన చేశారు. దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు పండాలని కోరుతూ ఈ యాగాన్ని బుధవారం నుంచి ఆదివారం వరకూ నిర్వహించనున్నారు. దేవస్థానానికి చెందిన 70 మంది అర్చకులు ఈ రుద్రయాగాన్ని నిర్వహిస్తున్నారు. మహోన్నతమైన ఈ యాగం ప్రారంభించిన రోజునే నగరంలో వర్షం పడటం శుభసూచకమని దేవస్థానం అర్చకులు ‘సాక్షి’కి తెలిపారు. 20వ తేదీ మధ్యాహ్నం పూర్ణాహుతితో రుద్రయాగం ముగుస్తుంది. అనంతరం మహామండపంలోని ఆరో అంతస్తులో శాంతి కళ్యాణం జరుగుతుందని ఈవో సూర్యకుమారి తెలిపారు. భక్తులు ఈ యాగంలో పాల్గొనాలని ఆమె కోరారు.