
మాట్లాడుతున్న చంద్రశేఖర్
- జిల్లా సైనిక సంక్షేమాధికారి చంద్రశేఖర్
కొత్తగూడెం: దేశసేవ చేసి ఉద్యోగ విరమణ చేసిన సైనిక ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తామని, కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరుస్తామని జిల్లా సైనిక సంక్షేమాధికారి చంద్రశేఖర్ తెలిపారు. గురువారం మాజీ సైనిక ఉద్యోగులతో కొత్తగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశంలో మాట్లాడారు. సైనిక ఉద్యోగుల పిల్లలకు ఉపకార వేతనాలు అందుతాయని, సంతానం వివాహం కోసం రూ.50వేలను ఖర్చుల కోసం అందజేస్తామని, ఇల్లు నిర్మించుకున్న వారు మొదటి నెలకు మాత్రమే ఇంటి పన్ను చెల్లించాలని, ఆ రశీదుతో శాశ్వతంగా ఇంటి పన్ను మినహాయింపు పొందొచ్చని వివరించారు. స్వయం ఉపాధి కల్పించేందుకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయిస్తామని, పెన్షన్ పొందనివారు తమ శాఖ నుంచి రూ.6 వేలను సంక్షేమ నిధిగా పొందొచ్చని, పిల్లల ఉన్నత విద్య కోసం ప్రత్యేక రిజర్వేషన్ లభిస్తుందని వివరించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు సహకారంతో చుంచుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో స్థలాన్ని కేటాయించారని, రిటైర్డ్ సైనిక ఉద్యోగుల కార్యాలయ నిర్మాణానికి రూ.1.75 కోట్లు మంజూరైనట్లు ప్రకటించారు. ఇళ్లులేని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఫ్రాన్సిస్, బాధ్యులు నర్సింహారావు, రషీద్, శ్రీనివాస్, వాసు తదితరులు పాల్గొన్నారు.