భారతదేశంలో ప్రతి ఏటా డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవం(కిసాన్ దివస్)గా జరుపుకుంటారు. దేశ ఐదవ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జన్మదినాన్ని పురస్కరించుకుని రైతు దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రైతులకు ఉపకరించేలా ప్రభుత్వం అందిస్తున్న కేంద్రప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం- కిసాన్)
రైతుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఈ పథకాన్ని 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద ఏడాదికి రూ ఆరు వేలు ఆర్థిక సహాయంగా దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు అందిస్తారు. ఈ మొత్తం ఆయా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ అవుతుంది.
2. ప్రధాన్ మంత్రి కిసాన్ మన్‌ధన్ యోజన (పీఎం-కేఎంవై)
ఈ పథకం లక్ష్యం రైతు కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడం. 18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల రైతులు ప్రతీనెలా రూ. 55 నుంచి రూ. 200 వరకూ ఈ పథకంలో చెల్లిస్తే, వారికి 60 ఏళ్లు వచ్చాక ప్రతీనెలా రూ. 3,000 పెన్షన్ రూపంలో పొందవచ్చు.
3. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)
ఈ పథకం కింద, రైతులు నారు వేయడం లేదా విత్తనం నాటడం నుండి పంట కోసే వరకు పంటల రక్షణ కోసం బీమాను అందిస్తారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే ఆర్థిక నష్టాలను భర్తీ చేయడానికి ఇది రైతులకు సహాయపడుతుంది.
4. జాతీయ తేనెటీగల పెంపకం, తేనె మిషన్ (ఎన్‌బీహెచ్‌ఎం)
తేనెటీగల పెంపకానికున్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, శాస్త్రీయంగా తేనెటీగల పెంపకానికి ప్రోత్సాహం అందించడమే ఈ పథకం లక్ష్యం. ‘తీపి విప్లవం’ లక్ష్యాన్ని సాధించే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. తేనెటీగల పెంపకందారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
5. నమో డ్రోన్ దీదీ
ప్రభుత్వం ఇటీవలే నమో డ్రోన్ దీదీ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద మహిళా స్వయం సహాయక బృందాలకు (ఎస్‌హెచ్‌జీ) డ్రోన్‌లను అందజేస్తున్నారు. గ్రామాల్లో నివసించే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ పథకం లక్ష్యం.
6. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ (కేసీసీ)
ప్రభుత్వం ఈ పథకం కింద రైతులకు వారి వ్యవసాయ అవసరాల కోసం తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తుంది. అలాగే రెండు శాతం వడ్డీ రాయితీని అందిస్తుంది.
ఇది కూడా చదవండి: తీర్థయాత్రా స్థలంగా సంభాల్.. యూపీ సర్కార్ ప్లాన్
Comments
Please login to add a commentAdd a comment