ఎవరికి చెప్పుకోవాలె ?
-
l జెడ్పీలో టాయిలెట్లు లేక ఉద్యోగుల కష్టాలు
-
l మహిళల పరిస్థితి మరీ అధ్వానం
-
l పట్టించుకోని ఉన్నతాధికారులు
హన్మకొండ : హన్మకొండలోని జెడ్పీ కార్యాలయంలో విధులు నిర్వర్తించే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూత్రశాలలు లేక అవస్థలు పడుతుండగా.. మహిళా ఉద్యోగుల కష్టాలైతే చెప్పే పరిస్థితిలో లేవు.
జిల్లా వ్యాప్తం గా మరుగుదొడ్లు నిర్మించే శాఖల ఉన్నతాధికారులు కొలువై ఉండే జిల్లా పరిషత్ ఆవరణలోనే.. ఉద్యోగులు కడుపునొప్పి సమస్యతో సతమతమయ్యే పరిస్థితి దాపురించింది. జిల్లా పరి షత్ ఆవరణలో జిల్లా పరిషత్, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఆడిట్ శాఖల కార్యాలయాలు ఉన్నాయి. దాదాపు 300 మంది ఉద్యోగులు ఆయా కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఉద్యోగుల కోసం జెడ్పీ మొదటి అంతస్తులో ఒక్కటి చొప్పున మూత్రశాలలు నిర్మించారు. అయితే, నిర్వహణ లేకపోవడంతో రెండు మరుగుదొడ్లకు తాళాలు వేశారు. దీంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళా ఉద్యోగులైతే తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. స్వచ్ఛ భారత్ చేపట్టే ఉన్నతాధికారులు ఉండే ఆవరణలోనే తమ పరిస్థితి ఎవరికీ చెప్పుకోలేని విధంగా మారిందని వారు వాపోతున్నారు.
నిర్మించే శాఖ వారికే..
మరుగుదొడ్లు, మురుగు కాల్వలను నిర్మించే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల జిల్లా కార్యాలయాలు జెడ్పీ ఆవరణలోనే ఉన్నా యి. ఇక్కడ పని చేసే ఉద్యోగులకే ‘కడుపు నొప్పి’ కష్టాలు వస్తుండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జెడ్పీ సీఈఓ, పీఆర్, ఆర్‌డబ్లూ్యఎస్ ఎస్‌ఈల కార్యాలయాలు జెడ్పీ ఆవరణలోనే ఉన్నాయి. వీరందరికీ వారి పేషీల్లోనే ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఉన్నాయి. దీంతో సాధారణ ఉద్యోగులు, సిబ్బంది కష్టాలు వీరికి తెలియడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉన్నతాధికారులు స్పందించి సొంత కార్యాలయాల్లో ‘స్వచ్ఛ భారత్’కు అంకురార్పణ చేయాలని సిబ్బంది కోరుతున్నారు.