ప్రతి నెలా ఉపకార వేతనాలు
విజయవాడ :
ఉద్యోగులు ప్రతి నెలా జీతాలు అందుకుంటున్నట్లుగానే కాలేజీ విద్యార్థులకు కూడా ఉపకార వేతనాలు చెల్లించేలా ప్రిన్సిపాళ్లు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్‌ఎస్ రావత్ చెప్పారు. నగరంలోని సెయింట్ ఆన్స్ నర్సింగ్ హోం ఆడిటోరియంలో బుధవారం జిల్లాలోని కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఈ–పాస్ విధానంలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్పులపై వర్క్‌షాపు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రావత్ మాట్లాడుతూ సామాజికంగా వెనకబడినవర్గాలకు ఇస్తున్న స్కాలర్‌షిప్‌ల పంపిణీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. స్కాలర్‌షిప్‌ల ప్రగతి నివేదికల్లో జీరో చూపిస్తున్న కళాశాలలను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ఒకటి, రెండు నెలలు ఆలస్యమైనా మూడో నెలలతో తప్పకుండా స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేయాలని, లేకపోతే కాలేజీపై చర్యలు తప్పవన్నారు. అవసరమైతే తర్వాత సంవత్సరం నిధులు నిలిపివేస్తామన్నారు.
చార్జ్ మెమోలు ఇవ్వండి
కాలేజీల పర్యవేక్షణలో అలసత్వం వహిస్తున్న అధికారులకు చార్జి మెమోలు జారీ చేయాలని కృష్ణా జిల్లా సోషల్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ ప్రసాద్‌కు రావత్ చెప్పారు. ప్రిన్సిపాళ్లు డిజిటల్ సిగ్నేచర్ ద్వారా స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయవచ్చని, హార్డ్‌కాపీ కారణంగా ఆలస్యం చేయవద్దని సూచిం చారు. హార్డ్ కాపీని ఆడిట్ కోసం వినియోగించాలని చెప్పారు. ఈ–పాస్ ద్వారా స్కాలర్‌షిప్‌ల పంపిణీ విధానంలో సందేహాలు ఉంటే నివృత్తి చేయడానికి ఈ వర్క్‌షాపు నిర్వహించినట్లు తెలిపారు. సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ ఎం.రామారావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు సంబంధించి 1,30,720 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిలో 46,144 కొత్తవి కాగా, 84,576 రెన్యువల్స్ ఉన్నాయని వివరించారు. ఈ సమావేశంలో స్పెషల్ సెక్రటరీ బీకే సింగ్, కృష్ణా జిల్లా సోషల్ వెల్ఫేర్ డెప్యూటీ డైరెక్టర్ మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.