ఈసారైనా సకాలంలో ఇస్తారా?
విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ తీరు
వచ్చే విద్యా సంవత్సరానికి 3.27లక్షల మంది అవసరం
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సర్వశిక్షా అభియాన్ ఏటా అందజేస్తోన్న యూనిఫామ్ ఎప్పుడూ ఆలస్యంగానే అందజేస్తోంది. విద్యా సంవత్సరం చివర దశలో తప్ప పూర్తి స్థాయిలో అందించలేకపోతోంది. విద్యా సంవత్సరం ప్రారంభం తరువాతే వీటి సరఫరాకు సన్నాహాలు చేస్తుండడంతో ఆలస్యమవుతోందని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. ఈసారైనా విద్యా సంవత్సరం ప్రారంభం అయిన వెంటనే యూనిఫామ్ విద్యార్థులకు అందించగలుగుతారో లేదో చూడాలి.
- రాయవరం
ఏటా విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే యూనిఫామ్స్ అందజేయాల్సి ఉండగా ఎప్పుడూ ఆలస్యంగా పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కూడా ఇదే పరిస్థితి. ఈ ఏడాది నుంచి నూతన విధానం అమలు చేస్తున్నందున మార్చి 20తోనే ప్రస్తుత విద్యా సంవత్సరం ముగుస్తుందని అంటున్నారు. జూన్ 12న పాఠశాలల పునఃప్రారంభం నాటికైనా యూనిఫామ్స్‌ను పంపిణీ చేయాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఏటా తప్పని జాప్యం..
2010–11 నుంచి విద్యార్థులకు ప్రభుత్వం యూనిఫామ్స్‌ను పంపిణీ చేస్తున్నారు. విద్యా హక్కు చట్టంలో భాగంగా 1వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఏటా యూనిఫామ్స్ ఇస్తున్నారు. అయితే ప్రతీ ఏడాది జాప్యం..గందరగోళం చోటు చేసుకుంటుంది. ముందుగానే అధికారులు చర్యలు తీసుకోని పక్షంలో వచ్చే జూన్‌లో యూనిఫామ్స్‌ను విద్యార్థులకు పంపిణీ చేసేందుకు వీలు ఉండదు.
ఎందుకిలా జరుగుతోంది?
2011–12లో యూనిఫామ్స్‌కు రావాల్సిన బడ్జెట్ ఆలస్యంగా రావడంతో ఆ ఏడాది చివర్లో పంపిణీ చేశారు. అప్పటినుంచి అదే పరిస్థితి కొనసాగింది. 2013–14 విద్యా సంవత్సరానికి సంబంధించిన యూనిఫామ్స్‌ను ఆ విద్యా సంవత్సరం చివర్లో పంపిణీ చేశారు. కొత్త సంవత్సరంలో ఎంతమంది చేరతారన్న విషయం తేలనందున ఆగస్టులో ఆప్కో సంస్థకు ఆర్డర్ ఇస్తున్నారు. ఆప్కో సంస్థ యూనిఫామ్స్ క్లాత్‌ను కొంత ఆలస్యంగా పంపుతోంది. దీంతో హడావుడిగా దుస్తులు కుట్టించి పంపిణీ చేసేందుకు విద్యా సంవత్సరం చివరి దశ వచ్చేస్తోంది.
3.17 లక్షల మందికి యూనిఫామ్స్..
2016–17 విద్యా సంవత్సరంలో 3,984 పాఠశాలలకు చెందిన విద్యార్థులు 3.17లక్షల మందికి రెండు జతల చొప్పున గత అక్టోబర్ నెలాఖరు నాటికి యూనిఫామ్ పంపిణీ చేశారు. కుట్టుకూలీకి సంబంధించిన సొమ్మును 29 మండలాలకు రూ.1.23 కోట్లు ఆయా పాఠశాలల అకౌంట్లకు బదిలీ చేశారు. ఇంకా 35 మండలాలకు రూ.1.10 కోట్లు కుట్టుకూలీ చెల్లించాల్సి ఉంది.
ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుంది
యూనిఫామ్స్ పంపిణీలో ఏటా ప్రభుత్వ డొల్లతనం బయట పడుతోంది. విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇవ్వాల్సిన యూనిఫామ్స్‌ను ఏటా ఆలస్యంగా పంపిణీ చేస్తున్నారు.
– పి.సుబ్బరాజు, అధ్యక్షుడు, ఎస్‌టీయూ
విద్యా సంవత్సరం ప్రారంభంలోనే..
విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్‌ను అందజేయాలని ఎప్పటినుంచో కోరుతున్నాం. అయినా పరిస్థితిలో మార్పు లేదు. కుట్టుకూలి పెంచాలని కూడా విన్నవించాం.
- టీవీ కామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్
ముందుచూపు ఉండాలి..
ప్రతి ఏడాది ఆలస్యంగా యూనిఫామ్స్‌ను పంపిణీ చేస్తున్నారు. ఈసారైనా ముందు చూపుతో వ్యవహరించాలి. వచ్చే విద్యా సంవత్సరానికి ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలి.
– చింతాడ ప్రదీప్‌కుమార్, ప్రధాన కార్యదర్శి, పీఆర్‌టీయూ
ప్రతిపాదనలు పంపించాం..
వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి 3.27లక్షల మందికి యూనిఫామ్స్ అవసరమని రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించాం. జూన్ నాటికి యూనిఫామ్ క్లాత్ పంపిణీకి చర్యలు తీసుకుంటున్నాం.
– ఇంటి వెంకట్రావు, కమ్యూనిటీ మొబలైజేషన్ అధికారి సర్వశిక్షా అభియాన్