ఉత్తమ అవార్డు దిశగా..
-
టెస్టింగ్ క్యాంపులో స్కౌట్స్ అండ్ గైడ్స్ సత్తా
-
ఐదు రోజుల శిక్షణ
-
మూడు జిల్లాల విద్యార్థులు హాజరు
గోదావరిఖనిటౌన్: క్రమశిక్షణకు మారు పేరు స్కౌట్స్ అండ్ గైడ్స్. వీరిని కూడా మరింత ఉత్తములుగా తీర్చిందిద్దేందుకు ఏటా క్యాంపులు నిర్వహిస్తుంటారు. అలాంటి క్యాంపు ఈ ఏడాది గోదావరిఖనిలో నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల ఈ క్యాంపులో పాల్గొనేందుకు మెదక్, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి ప్రభుత్వ, ప్రై వేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు వెయ్యిమంది హాజరయ్యారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ సోపాన్‌లో వీరు శిక్షణ పొందుతున్నారు. ఈ శిక్షణలో ఉత్తీర్ణులైన విద్యార్థులు గవర్నర్, రాజ్యపురస్కార్ అవార్డుకు ఎంపిక అవుతారు. అనంతరం రాష్ట్రపతి అవార్డు శిక్షణ ఉంటుంది. ఈ క్యాంపులో నిత్య జీవితంలో ఎలా నడుచుకోవాలో, విద్యార్థులకు ఉండాల్సిన సేవా, ఇతర ముఖ్య అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. నిజజీవితంలో ఎదుర్కొనే కష్టాలను ఎలా అధిగమించాలో నేర్పుతూ ఉత్తమలుగా తయారు చేస్తున్నారు. ఈ క్యాంప్ కోసం రాష్ట్ర, ప్రాంతీయ, స్థానికంగా ఉన్న కౌన్సిలర్స్, మాస్టర్స్, రోవర్స్, ప్రత్యేక శిక్షకులు సుమారు 50 మంది ప్రత్యేక బృందాలుగా శిక్షణ ఇస్తున్నారు.
శిక్షణలోని అంశాలు
రోప్ నాటింగ్, టవర్ మేకింగ్, జెండా మేకింగ్, అథ్లెటిక్స్, గార్డ్‌నర్, స్విమ్మింగ్, కుక్, సామాజిక అవగాహన, పరిశుభ్రత, తెలివితేటలు, సేవాభావం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, ఆరోగ్య పరిరక్షణ, గ్రామల్లో సేవా, విద్యలో రాణించడం, ఇతర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ఈ అంశాలలో ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రత్యేక సర్టిఫికెట్లు అందిస్తారు.
రాష్ట్రపతి అవార్డు కోసం శిక్షణ
ఏడు నెలల పాటు ప్రథమ, ద్వితీయ, తతీయ సోపాన్‌ల తరువాత గవర్నర్, రాజ్యపురస్కార్ అవార్డును అందుకున్న విద్యార్థులు అనంతరం రాష్ట్రపతి అవార్డుకు అర్హులవుతారు. దీని కోసం ప్రత్యేక పరీక్ష రాయాల్సి ఉంటుంది. స్టేట్‌బాడీ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన అనంతరం రాష్ట్రపతి అవార్డుకు అర్హత సాధిస్తారు. దీని కోసం మరో మూడు నెలలు ప్రత్యేక శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రపతి అవార్డు పొందిన విద్యార్థులు ప్రతీ పోటీ పరీక్షలో 5 శాతం మార్కులు అదనంగా పొందుతారు. పోటీ పరీక్షలలో, ఉద్యోగ అవకాశాల కోసం రాష్ట్రపతి అవార్డు ఎంతగానో ఉపయోగపడుతుంది.