
స్ర్కాప్ యార్డ్‌గా గుత్తి డిపో!
– క్రమేణా తగ్గుతున్న బస్సు సర్వీసులు
– ఇప్పటికే డిపోలో 40 స్క్రాప్ బస్సులు
ఒకప్పుడు జిల్లాకే తలమానికంగా ఉన్న గుత్తి ఆర్టీసీ డిపోకు రాజకీయ గ్రహణం సోకింది. లాభాల దిశగా నడుస్తున్న డిపోను నష్టాల పేరుతో మూతవేశారు. కార్మిక సంఘాలు, స్థానికుల ఐక్య పోరాటాలతో తిరిగి దీనిని పునరుద్ధరించారు. కేవలం జిల్లాకు చెందిన ఓ రాజకీయ నాయకుడికి ప్రజా రవాణా వ్యవస్థను అనుకూలంగా మార్చేందుకు గుత్తి ఆర్టీసీ డిపోని మరోసారి మూతవేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే సర్వీసులు తగ్గిపోయాయి. ప్రస్తుతం 25 సర్వీసులతో మాత్రమే నడుస్తున్న డిపోలో 40 స్ర్కాప్ బస్సులు ఉన్నాయి. పరిస్థితి చూస్తుంటే గుత్తి డిపోని స్ర్కాప్ యార్డ్‌గా మార్చేందుకు ప్రయత్నాలు శరవేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
- గుత్తి
కేవలం ఆరు సర్వీసులతో 1976లో ఏర్పాటైన గుత్తి డిపో అనతి కాలంలోనే 56 సర్వీసులకు చేరుకుంది. మహానగరాలైన బెంగుళూరు– హైదరాబాద్‌కు మధ్యలో ఉండటం వల్ల డిపో శరవేగంగా అభివృద్ధి చెందింది. రాష్ట్రంలోనే ఉత్తమ డిపోగా అనేక అవార్డులు, రివార్డులను సొంతం చేసుకుంది. డిపోలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకూ పలు రివార్డులు దక్కాయి. మంచి లాభాల బాటలో నడుస్తున్న సమయంలోనే నష్టాల వస్తున్నాయంటూ 2006 డిసెంబర్‌లో ఈ డిపోను మూతవేశారు. ఆ సమయంలో పార్టీలకు అతీతంగా వేలాది మంది యువత, ప్రజాసంఘాలు, న్యాయవాదులు, కార్మికులు పోరాటాల ఫలితంగా దిగివచ్చిన ప్రభుత్వం 2007 ఆగస్టులో మూడు సర్వీసులతో డిపోను పునరుద్ధరించింది.
ఆరు మాసాలకు ఒకసారి..
జిల్లాలో రవాణా వ్యవస్థను శాసిస్తున్న ఓ రాజకీయ ప్రముఖుడి ప్రాపకం కోసమే గుత్తి డిపోను నిర్వీర్యం చేసినట్లు అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే నేటికీ ఆ రాజకీయ నాయకుడికి విదేయత చాటుకునేందుకు ఆర్టీసీ అధికారులు గుత్తి డిపోకు పూర్వ వైభవాన్ని సమకూర్చలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 26 సర్వీసుతలో నడుస్తున్న డిపోలో ఐదు రోజుల క్రితం బెంగళూరు, హైదరాబాద్ సర్వీస్‌లను ఇతర డిపోలకు బదిలీ చేశారు. నష్టాల కారణం చూపుతూ ప్రతి ఆరు మాసాలకు ఒకసారి బస్సులను ఇతర డిపోలకు తరలిస్తూ గుత్తి డిపోను మూతవేసేందుకు చాపకింద నీరులా కుట్రలు సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న 24 సర్వీసుల్లో బస్సులు కూడా కాలం చెల్లినవి కావడం గమనార్హం.
రాజుకుంటున్న ఆందోళనలు
రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన ఆర్టీసీ యాజమాన్య వైఖరిని నిరసిస్తూ కార్మికులతో పాటు స్థానికులు, వ్యాపారులు, వైఎస్సార్ సీపీ, సీపీఐ నాయకులు మండిపడుతున్నారు. ఐదు రోజుల క్రితం డిపో నుంచి రెండు లాంగ్ సర్వీస్ బస్సులను మరో డిపోకు తరించేందుకు ప్రయత్నిస్తుండగా వైఎస్సార్ సీపీ నాయకులు అడ్డుకున్నారు. ఆ సమయంలో ఆర్టీసీ ఉన్నతాధాకారులు తాత్కాలికంగా తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆ మరుసటి రోజే బెంగుళూరు, హైదరాబాద్ సర్వీసులను రద్దు చేసి తాడిపత్రి, అనంతపురం డిపోలకు అప్పగించేశారు.
మరోసారి కుట్ర
అన్ని గ్రామాలు, పట్టణాలకు ప్రధాన కూడలి అయిన గుత్తిలో డిపో మూత వేయడానికి కుట్రలు భారీగానే సాగిస్తున్నారు. ఇందుకు అధికారుల వైఖరి అద్దం పడుతోంది. డిపోను పునరుద్ధరించి పదేళ్లు కావస్తున్నా.. ఇంత వరకూ పూర్తి స్థాయి డిపో మేనేజర్‌ను నియమించలేదు. గుంతకల్లు ఆర్టీసీ డిపో మేనేజర్‌నే ఇన్‌చార్జ్‌గా కొనసాగిస్తూ వచ్చారు. అధికారికంగా గుత్తి డిపో పూర్తి స్థాయి డిపో కాదు. కేవలం శాటిలైట్ డిపో మాత్రమే. తాజా పరిస్థితులను బట్టి త్వరలో గుత్తిడిపోను మూతవేసి స్ర్కాప్ యార్డ్‌గా మార్చనున్నట్లు విశ్వసనీయ సమాచారం.