రెండో ఫ్యాక్టరీ రెడీ
దమ్మపేట(అశ్వారావుపేట): దశాబ్దకాలంగా ఇక్కడ పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలనే ఈ ప్రాంత రైతాంగం డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. దమ్మపేట మండలం అశ్వారావుపేటలో రూ.72 కోట్ల వ్యయంతో చేపట్టిన పామాయిల్ ఫ్యాక్టరీ ట్రయల్ రన్ విజయవంతమైంది. స్థానిక శాసనసభ్యుడు, ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు శనివారం ట్రయల్‌రన్ నిర్వహించారు. గత ఏడాది ఏప్రిల్‌లో అక్కడ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ ఫ్యాక్టరీ రోజుకు 20 గంటలు పనిచేస్తుంది. నాలుగు గంటలు మెయింటెటెన్స్ నిమిత్తం నిలిపివేస్తారు. గంటకు 30 టన్నుల పామాయిల్ గెలల క్రషింగ్ సామర్థ్యంతో పనిచేసే ఈ ఫ్యాక్టరీలో రోజుకు 600 టన్నులను క్రషింగ్ చేస్తారు.
ఏడాదికి 1.20 లక్షల టన్నులు..
ఫ్యాక్టరీలో ఏటా 1.20 లక్షల టన్నుల పామాయిల్ గెలలను క్రషింగ్ చేయాలని ఆయిల్‌ఫెడ్ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణ ఆయిల్‌ఫెడ్ పరిధిలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో 12,196 హెక్టార్లలో పామాయిల్ సాగు విస్తరించి ఉంది. వీటిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే 23 వేల ఎకరాల్లో సాగులో ఉండగా, అందులో ఒక్క దమ్మపేట మండలంలోనే 13 వేల ఎకరాలు సాగులో ఉంది. ప్రస్తుత పంట దిగుబడి ఆధారంగా 80 వేల టన్నులు క్రషింగ్ చేయించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట, అశ్వారావుపేట, ములకలపల్లి, పాల్వంచ, చండ్రుగొండ, జూలూరుపాడు, ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, తల్లాడ, ఏన్కూరు మండలాలల్లో పామాయిల్ పంట సాగులో ఉంది. ఈ రెండు జిల్లాలతో పాటు, సూర్యాపేట జిల్లాలో కూడా ఈ ఏడాది 10 వేల హెక్టార్లలో పామాయిల్ సాగు విస్తీర్ణం పెంచాలని ఆయిల్‌ఫెడ్ లక్ష్యంగా పెట్టుకుంది.
శుద్ధిచేసిన పామాయిల్ ఇక్కడే తయారీ
శుద్దిచేసి కల్తీలేని పామాయిల్‌ను తెలంగాణ బ్రాండ్‌తో ఇక్కడ నుంచే విక్రయాలు జరిపేలా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు అశ్వారావుపేట శాసనసభ్యుడు, రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఫ్యాక్టరీ ట్రయల్ రన్ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇక్కడే ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అశ్వారావుపేటలో ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న పామాయిల్ కర్మాగారంలో వచ్చిన ఆయిల్ శాతమే రెండు రాష్ట్రాల్లోని పామాయిల్ ధరను నిర్ణయిస్తోందని తెలిపారు.
తెలంగాణ పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి రామచంద్రప్రసాద్ మాట్లాడుతూ పామాయిల్ ధరల్లో తెలంగాణాదే పై చేయి అని అన్నారు. తొలుత తాటి వెంకటేశ్వర్లు ట్రాక్టర్‌ను నడిపి పామాయిల్ గెలలను హైడ్రాలిక్ షెట్టర్ల వద్ద దిగుమతి చేశారు.ఆయిల్‌ఫెడ్ సీనియర్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి, డీఎం ఉదయ్‌ధీర్‌రెడ్డి, ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి, డీఈ రామారావు, ఎంపీపీ అల్లం వెంకమ్మ, జేడ్పీటీసీ దొడ్డాకుల సరోజనీ రాజేశ్వరరావు, మాజీ సొసైటీ అధ్యక్షుడు పైడి వెంకటేశ్వరరావు, సర్పంచ్ బుద్దా రాజు, ఎంపీటీసీ గంటా వెంకటేశ్వరరావు, రావు గంగాధరరావు, ఏఎంసీ చైర్మన్ తానం లక్ష్మీ, వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు, ఆత్మ కమిటీ చైర్మన్ కేవీ సత్యన్నారాయణ, టీఆర్‌ఎస్ నాయకులు పానుగంటి సత్యం, పోతినేని శ్రీరామవెంకటరావు, దారా యుగంధర్, తదితరులు పాల్గొన్నారు.